అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Mar 13,2024 23:40 #family died, #gunter, #suside
  • భార్య మృతి 
  • చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : అప్పుల బాధ, కుమార్తె కాపురంలో చిచ్చురేగిందన్న మనస్తాపంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నాజరుపేటలో బుధవారం చోటుచేసుకుంది. తెనాలి వన్‌టౌన్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాజరుపేటకు చెందిన విష్ణుమొలకల శివశంకరరావు, ఆయన భార్య నాగమణి (55) పాలవ్యాపారంతో జీవనం సాగించేవారు. వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా స్థానిక త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో టీ స్టాల్‌ పెట్టుకున్నారు. అయినా అప్పుల భారం తీరలేదు. అదే సమయంలో వారి కుమార్తె చంటి హారికకు ఆమె భర్త, అత్త మామల నుండి వేధింపుల మొదలయ్యాయి. దీనిపై గతేడాది జూన్‌లో పట్టణ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో పరస్పరం కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో హారిక పుట్టింట్లోనే ఉంటున్నారు. ఓ వైపు అప్పుల భారం, మరోవైపు కుమార్తె కాపురం కుదటపడకపోవటంతో మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి శివశంకరరావు భార్య, కుమార్తెతో కలిసి విష గుళికలు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందారు. శివశంకరరావు, హారిక చికిత్స పొందుతున్నారు. పట్టణ ఒన్‌టౌన్‌ సిఐ, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. సిఐ దశరధరామారావు మాట్లాడుతూ గతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులు విచారణలో ఉన్నాయని, ఆ కేసుల్లో న్యాయం జరగలేదని బాధితులు చెప్పడంలో వాస్తవంలేదని అన్నారు. ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు శివశంకరరావు అల్లుడు, వియ్యంకుడు, వియ్యపురాలిపైనా కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఆస్పత్రి వద్ద నాగమణి బంధువుల ఆందోళన
ఆస్పత్రి నుంచి నాగమణి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె బంధువులు నిరాకరించారు. నాగమణి కుమార్తెను వేధింపులకు గురిచేసిన ఆమె భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.

➡️