ఒఎన్‌జిసి పైపులైన్‌ పనులను అడ్డుకున్న రైతులు

– అదుపులోకి తీసుకుని కలెక్టరేట్‌కు తరలించిన పోలీసులు
– కలెక్టర్‌ ఆదేశాలతో నిలిచిన పనులు
ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి):తమ పంట పొలాలకు వెళ్లే మార్గంలో గ్యాస్‌ పైపులైన్‌ వేయొద్దంటూ ఆయా పనులను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని రైతులు, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకుని భీమవరంలోని జిల్లా కలెక్టరేట్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురంలోని రుస్తుంబాదలో టెంపుల్‌ల్యాండ్‌ నెంబర్‌. 4వ గేటుకు సీతారామపురంలోని రిగ్‌ నుంచి యర్రంశెట్టివారి పాలెం మీదుగా సుమారు రెండు కిలోమీటర్లు మేర ఒఎన్‌జిసి పైపులైన్‌ నిర్మాణం అధికారులు చేపట్టారు. రుస్తుంబాద-యర్రంశెట్టివారిపాలెం మధ్య పొలాల్లోంచి ఈ పైపులైన్ల ఏర్పాటుకు రైతులు వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఒఎన్‌జిసి అధికారులు పోలీసు బందోబస్తు నడుమ పొలాల్లోంచి కాకుండా రైతులు రాకపోకలు సాగించే ప్రభుత్వ పుంత భూముల్లోంచి పైపులైన్‌ ఏర్పాటు పనులు ప్రారంభించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. నరసాపురం డిఎస్‌పి శ్రీనివాసులు ఆధ్వర్యాన పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకుని భీమవరంలోని కలెక్టరేట్‌కు తరలించారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు తమ ఇబ్బందులు, ఆందోళనను రైతులు వివరించారు. కలెక్టర్‌ స్పందించి రైతుల సందేహాలను నివృత్తి చేసేవరకూ పైపులైన్‌ పనులు ఆపాలని అక్కడికక్కడే ఆదేశించడంతో ఒఎన్‌జిసి సిబ్బంది పనులు నిలిపివేసి వెనుదిరిగారు. అనంతరం గ్రామానికి రైతులు చేరుకోవడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ నేపథ్యంలో రైతులు యర్రంశెట్టి హరి తదితరులు మాట్లాడుతూ ఈ పైప్‌లైన్‌ వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. గతంలో పైప్‌లైన్‌ వేస్తామని పనులు ప్రారంభించినప్పుడు ఆందోళనతో మారుబోయిన సత్యనారాయణ మృతి చెందాడని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమి కాబట్టి ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వబోమని ఒఎన్‌జిసి అధికారులు చెప్పారని తెలిపారు. గతంలో రైతులకు నష్టపరిహారం ఇస్తామని వారే చెప్పి ఇప్పుడు ఇలా పనులు ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను బలవంతంగా కలెక్టరేట్‌కు తీసుకెళ్లిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️