పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 6,2023 08:59 #Crop Damage, #heavy rains
  • తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
  • పంటలను, ధాన్యం రాశులను పరిశీలించిన సిపిఎం నాయకులు

ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, టార్ఫాలిన్లలను సరఫరా చేయాలని కోరారు. పట పంట మునిగిన పొలాలను, తడిచిన ధాన్యం రాళులను సోమవారం నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల, పెదకాకాని, మంగళగిరి మండలాల్లో దెబ్బతిన్న పొలాలను సిపిఎం బృందం పరిశీలించి, రైతులతో మాట్లాడింది. ఎకరాకు రూ. 30 నుండి 35వేలు ఖర్చు చేశామని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను వల్ల పంట మొత్తం నాశనమైందని పలువురు రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు కాకుమాను నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తాడేపల్లి మండలం చిర్రావూరు, గుండిమెడ, తెనాలి మండలంలో రైతు సంఘం నాయకులు పర్యటించారు.పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో రైతుల వద్ద ఉన్న ధాన్యపు రాశులను సిపిఎం నేతలు పరిశీలించి రైతుల అవస్థలు అడిగి తెలుసుకున్నారు. పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు, ఆచంట, యలమంచిలి మండలాల్లో ఎపి కౌలురైతు సంఘం నేతలు పర్యటించారు. తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి బాయిల్డ్‌ మిల్లులకు తరలించాలని, టార్ఫాలిన్లను సరఫరా చేయాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి, దోసపాడు గ్రామాల్లో సిపిఎం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించారు. కళ్లాలోని ధాన్యాన్ని, నేల వాలిన వరి పంటలను పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాంతంలో ముంపునకు గురైన వరి పంటలను సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం నేతృత్వంలో పార్టీ బృందం పరిశీలించింది. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు.

➡️