అనంతలో చీనీచెట్లు నరికివేత

May 23,2024 23:46 #Ananta, #Chinese trees, #Felling

ప్రజాశక్తి-పెద్దపప్పూరు :అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్షమ్మకు చెందిన 189 చీనీ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి నరికివేశారు. 18 నెలల వయస్సున్న మొక్కలను నరికివేశారు. ఇదే రైతుకు చెందిన మామిడి మొక్కలను గతంలో కూడా నరికివేశారు. అప్పట్లో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులు ఎవరనేది బయట పడలేదు. ఇదే గ్రామానికి చెందిన బాలవర్దిరాజుకు చెందిన 300 చీనీ చెట్లు, భాస్కర్‌కు చెందిన 150 చీనీచెట్లను గతంలో గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. చెట్లు నరికివేసిన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శరత్‌చంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత మహిళా రైతుతో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ తెలియజేశారు.
పోలీసుల తీరుపై విమర్శలు
రెడ్డిపల్లి గ్రామంలో తరచూ పండ్ల తోటలను నరికివేస్తున్నా పోలీసులు స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుస ఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు నిందితులను గుర్తించడంలో విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో ఒకదాని తర్వాత మరొక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను గుర్తించి చట్టప్రకారం వారిని కఠినంగా శిక్షించాలని రెడ్డిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మహిళా రైతుకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు రాజారాంరెడ్డి కోరారు. జిల్లా ఎస్‌పి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కోరారు.

➡️