విద్యుత్‌ పొదుపులో రాష్ట్రానికి మొదటి స్థానం – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పొదుపు, పరిరక్షణలో రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, ఇంధన పరిరక్షణ సమితి సిఇఒ బిఎవిపి కుమార్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు. 5 నుంచి 15 మిలియన్‌ టన్నుల చమురు సమానమైన విద్యుత్‌ పొదుపునకు సంబంధించిన గ్రూప్‌-2లో ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా విజయానంద్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయ, సహకారాలు, మార్గదర్శకత్వం, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వినియోగదారుల భాగస్వామ్యంతో ఈ అవార్డు సాధించినట్లు తెలిపారు. విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విభాగాల్లో నోడల్‌ అధికారులతో ఎనర్జీ కన్సర్వేషన్‌ సెల్స్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గృహ, పరిశ్రమ, వ్యవసాయ, భవనాల్లో రూ.4 వేలకోట్ల సమానమైన 5,600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పొదుపు చేసే అవకాశం ఉందని తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య, నివాస భవనాల్లో విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించేందుకు ఎనర్జీ కన్సర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఇసిబిసి) అమలులో ప్రధాన పురోగతిని ఇంధన పరిరక్షణ సమితి సాధించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ శాఖలతోపాటు ఆర్‌టిసిలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. విద్యుత్‌ పొదుపు కోసం వివిధ రంగాల్లో ప్రత్యేక బడ్జెట్‌ను అందించిందన్నారు. ఇంధన పరిరక్షణ సమితికి సహకరించి ఈ విజయానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి, బిఇఇలకు సిఇఒ కుమార్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

➡️