నిధుల కోసం…బిసి భవన్‌ ముట్టడించిన రజకులు

Jan 30,2024 08:09 #Dharna, #Rajaka Vruti Sangham
  •  తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నాలుగున్నరేళ్ల కాలంలో నిధులు కేటాయించకుండా వైసిపి ప్రభుత్వం రజకులను మోసం చేసిందని, ఆ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రజకులు పెద్ద సంఖ్యలో బిసి భవన్‌ను ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఎపి రజకవృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో తరలివచ్చిన రజకులు సోమవారం విజయవాడ గొల్లపూడిలోని బిసి భవన్‌ను ముట్టడించారు. బిసిభవన్‌ గేట్‌ ముందు భైఠాయించారు. రజకుల కోసం అట్రాసిటి చట్టాన్ని రూపొందించాలని, 50ఏళ్లకు వృద్దాప్య పించన్‌ను ఇవ్వాలని, దోభిఘాట్‌లను నిర్మించాలని, రజక ఫెడరేషన్‌లకు నిధులను కేటాయించాలని, రజక కార్పొరేషన్‌కు అధికారాలు కల్పించి, రజకులకు ఆర్థిక సాయం అందించేలా విధానాన్ని రూపొందించాలని నినాదాలు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో గేట్‌ను దాటి కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకు పోయారు. కార్యాలయ ఆవరణలోనూ బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రజక కార్పొరేషన్‌ ఎమ్‌డి మల్లికార్జునరావు వచ్చి ఎపి రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రజక అభివద్ధి సంక్షేమ కార్పొరేషన్‌కు విధివిధానాలు రూపొందించకుండా చైర్మన్‌ను, 12 మంది డైరక్టర్‌లను నియమిస్తే రజకుల అభివద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే రజక కార్పొరేషన్‌ బోర్డు మీటింగ్‌ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఆ ఒక్క సమావేశంలోనూ చేసిన తీర్మానాలను ఇప్పటిదాకా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.. చాలా గ్రామాల్లో రజకులను సామాజిక బహిష్కరణ చేస్తున్నారని, తమకు కూడా అట్రాసిటి చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్‌డి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకుల గుంట అంకయ్య, మల్లేశ్వరరావు, లింగాల నిర్మలమ్మ, వల్లభాపురం వెంకటేశ్వరరావు, పాగోలు శ్రీనివాసరావు, వెంకట నరసయ్య, నాగేశ్వరరావు, పాండురంగారావు, మాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️