చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ధ్వంసం -మాజీ మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం తగదని, వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే ధ్వంసమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2014 నుంచి 2019 కాలంలో 72 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ కొద్దీ పూర్తికావడానికి నాలుగేళ్ల సమయం ఎందుకు పడుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. నదీ ప్రవాహం మళ్లింపు పనులు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి కాకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదమని తెలిపారు. వాస్తవంగా జగన్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయని అన్నారు. కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే నిర్మాణ పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని తెలిపారు. రాజధాని, పోలవరం పూర్తిచేసే అవకాశాన్ని ప్రజలిచ్చారని, చంద్రబాబు సద్వినియోగం చేసుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి తప్ప గత జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదని అన్నారు.

➡️