శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం

Apr 15,2024 23:26 #2024 elections, #chandrababu, #TDP
  • ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ నిర్లక్ష్యం
  •  ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి- విజయనగరం, శ్రీకాకుళం ప్రతినిధులు : తాము అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం,శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని చెప్పారు. ఉత్తరాంధ్రలోని సుజల స్రవంతి మినహా టిడిపి హయాంలో ఐదేళ్లలో జలవనరుల ప్రాజెక్టుల కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగన్‌ రూ.594 కోట్లు మాత్రమే ఖర్చ చేశారని వివరించారు. సాగు నీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టుకు టిడిపి హయాంలో రూ.284 కోట్లు ఖర్చు పెడితే, జగన్‌ పెట్టిన ఖర్చు రూ.76 కోట్లు మాత్రమేనన్నారు. మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌కు టిడిపి రూ. 553 కోట్లు ఖర్చు పెడితే, జగన్‌ ఖర్చు పెట్టింది కేవలం రూ. 26 కోట్లని వివరించారు. తోటపల్లికి తాము రూ.237 ఖర్చు పెడితే, గజపతినగరం బ్రాంచి కెనాల్‌తో కలిపి జగన్‌ పెట్టిన ఖర్చు రూ. 61 కోట్లు మాత్రమేనని తెలిపారు. వంశధార ఫేజ్‌ 2కి రూ.420 కోట్లు తాము ఖర్చు పెడితే, జగన్‌ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానాకి రూ.145 కోట్లు తాము ఖర్చు పెడితే, జగన్‌ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వివరించారు. సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలోనూ, సలహాదారులకూ వేతనాలు రూపంలోనూ వైసిపి ప్రభుత్వం దోచిపెట్టిందని, ఈ డబ్బులను ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని వివరించారు. జగన్‌కు విశాఖపై ప్రేమలేదని, ప్రేమంతా ఇక్కడి భూములు, ఇతర వనరులపైనేనని అన్నారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు ప్రమాదకరం
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టానికి స్వస్తి పలుకుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలోనే ఉన్నారన్నారు. చదువుకున్న వారిలో 24 శాతం మంది ఖాళీగా ఉన్నారని వివరించారు. జగన్‌ ఐదేళ్లలో ఒక్క డిఎస్‌సి కూడా ప్రకటించలేదన్నారు. తాము అధికారంలోకొస్తే ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటించి గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులు, 25 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం ఎనిమిది లక్షల మందికి పిఆర్‌సి ఎగనామం పెట్టిందని, తాము వస్తే పిఆర్‌సి ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

➡️