ఏజెన్సీలో మొబైల్‌ వాహనాల ద్వారానే రేషన్‌ ఇవ్వండి

  • ముఖ్యమంత్రికి వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో రేషన్‌ డిపోల ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించడం గిరిజనుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ప్రతి రేషన్‌కార్డు దారు 10 నుండి 15 కిలోమీటర్లు నడిచి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. పేదవారికి ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించి ఎప్పటిమాదిరే మొబైల్‌ వాహనాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 221 మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. 671 డిపోల నుండి 2,90,892 కార్డుదారులకు నెలకు 1.40 లక్షల టన్నుల రేషన్‌ బియ్యం ఇస్తున్నారని తెలిపారు. ఒక వాహనానికి ఇద్దరు చొప్పున 442 మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఈ పద్ధతిని రద్దు చేస్తే వారందరూ ఉపాధి కోల్పోతారని తెలిపారు. ఒక్కో మొబైల్‌ వాహనాన్ని ఆరు లక్షల ఖరీదు చేసి కొన్నారని పేర్కొన్నారు. 90 శాతం సబ్సిడీతో 2026 వరకూ మొబైల్‌ వాహనాలు నడిపేందుకు గత ప్రభుత్వం అగ్రిమెంటు చేసిందని వివరించారు. వాహనాలకు సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోందని, రద్దు చేస్తే వాహనాలకు కట్టాల్సిన రుణం కట్టలేక వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని పేర్కొన్నారు. వాహనదారులు నిరుద్యోగపాలు కాకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

➡️