గొంతెండుతోంది… నీరివ్వండి

ప్రజాశక్తి- అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) : ‘ప్రజల గొంతెండుతోంది. వెంటనే తాగునీరు సరఫరా చేయండి’ అంటూ విజయవాడ నగరంలోని 64వ డివిజన్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ (కండ్రిక కాలనీ), ప్రజాశక్తి నగర్‌, బర్మాకాలనీ తదితర ప్రాంతాల ప్రజలు బుధవారం ఆందోళనకు దిగారు. స్థానికులు, మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారి ఆందోళనకు సిపిఎం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మద్దతు తెలిపారు. గత రెండు నెలలుగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని, మురుగు నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది నీరు కాకుండా బోర్‌ నీటిని అందిస్తున్నారని బాబూరావు దృష్టికి తీసుకెళ్లారు. నీటి సరఫరా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కృష్ణా నది చెంతనే ఉన్న విజయవాడలో ఎన్నడూలేని విధంగా తాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తాగునీటితో వ్యాపారం చేయడం తప్ప, నీటి సరఫరాపై నగర పాలక సంస్థకు దృష్టి లేదని విమర్శించారు. ప్రజలకు తాగునీటిని అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మురుగునీటి సరఫరాతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపారు. నీటి కాలుష్యంతో నలుగురు మరణించినా ప్రభుత్వం, నగరపాలక సంస్థ స్పందించకపోవడం శోచనీయమన్నారు. మూడు నెలలుగా తాగు నీటి కొరత ఉన్నా వైసిపి ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. వేసవి ముంచుకొస్తున్నా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ లేదని, నీటి కొరతను అధిగమించే చర్యలు తీసుకోవడంలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల మంచినీటి పథకం ‘అమృత్‌’ పేరుతో నీటిమీటర్లు బిగించడానికి పూనుకుంటోందన్నారు. ఇందుకుగాను కేంద్రం విధిస్తున్న షరతులకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి నగరంలో లక్ష మీటర్ల ఏర్పాటుకు సిద్ధపడిందని తెలిపారు. నీటి మీటర్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, తాగు నీటి సరఫరాలో లేకుండా పోయిందని విమర్శించారు. 24 గంటలూ మద్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం, అరగంట సేపు కూడా మంచినీరు సరఫరా చేయకపోవడం బాధాకరమన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర పాలక సంస్థ ప్రతి సంవత్సరం ఏడు శాతం చొప్పున మంచినీటి ఛార్జీలు పెంచిందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం కూడా అదే దారిలో నడిచిందని వివరించారు. కార్పొరేషన్లో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు సింగ్‌నగర్‌, పాయకాపురం ప్రాంతానికి ఎనిమిది ఎంజిడి ప్లాంట్‌ ద్వారా కృష్ణా నది నుండి తాగు నీటిని అందించిన విషయాన్ని ఈ సందర్భంగా బాబూరావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, నాయకులు కె.దుర్గారావు, ఝాన్సీ పాల్గొన్నారు.

➡️