గోదావరిలో కూటమి గలగలలు

  • 35 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌
  • ఐదుగురు మంత్రులు,విప్‌ల పరాజయం

ప్రజాశక్తి- పశ్చిమగోదావరి డెస్క్‌ : గోదావరి జిల్లాలు మరోసారి ఏకపక్షంగా టిడిపి కూటమికి జై కొట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టిడిపి కూటమి ఉభయగోదావరి జిల్లాల్లోని 35 సీట్లు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కూటమి ప్రభంజనానికి వైసిపి పత్తా లేకుండా పోవడం గమనార్హం. ఏలూరు జిల్లాలోని పోలవరం మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ మొదటి నుంచి కూటమి అభ్యర్థులే ఆధిపత్యం కనబర్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాల్లో 14 టిడిపి, ఆరు జనసేన, ఒక స్థానం బిజెపి కైవసం చేసుకున్నాయి. మూడు ఎంపీ స్థానాల్లో రెండు టిడిపి, ఒకటి బిజెపి చేజిక్కించుకున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకుగాను ఎనిమిది టిడిపి, ఐదు జనసేన, ఒకటి బిజెపి కైవసం చేసుకోగా, రెండు ఎంపీ స్థానాల్లో టిడిపి, బిజెపి చెరొకటి గెలుపొందాయి. ఈ రెండు జిల్లాల్లో ఆరుగురు మంత్రులు పరాజయం పాలవ్వగా, మాజీ మంత్రులు సైతం కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి కన్పించింది.
గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం అదేరీతిగా ఈ రెండు జిల్లాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసిన టిడిపి కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. గోదావరి జిల్లాలు ప్రతి ఎన్నికల్లో ఏదోక పక్షం వైపు మొగ్గు చూపుతాయనేది గత లెక్కలు చెబుతున్నాయి. అయిత,ే ఈసారి దానికి మించి మొత్తంగా టిడిపి కూటమికే జై కొట్టడం రాజకీయ పరిశీలకుల అంచనాలకూ అందకుండాపోయింది.
రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఊహించిన విధంగానే 70 వేలకుపైగా మెజార్టీతో విజయఢంకా మోగించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కనుమూరి రఘురామకృష్ణంరాజు సైతం విజయకేతనం ఎగురవేశారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసి ఓటమి పాలైన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు విజయం సాధించడం విశేషం. కృష్ణా జిల్లా పెనమలూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసిపి నుంచి టిడిపి గూటికి చేరి నూజివీడు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయ కేతనం ఎగురవేశారు.

తండ్రీ కొడుకులు ఓడారు… గెలిచారు
మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వైసిపి అభ్యర్థిగా తణుకు నుంచి బరిలోకి దిగగా, ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు. ఇరువురూ ఓటమి పాలయ్యారు. టిడిపి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ గెలుపొందగా, ఆయన తండ్రి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు నుంచి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు.

వైసిపి ఘోర ఓటమికి కారణాలెన్నో!
గోదావరి జిల్లాల్లో ప్రతి ఎన్నికల్లో ఏదోక పక్షం వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఒక పక్షమే క్లీన్‌ స్వీప్‌ చేసిన దాఖలాలు టిడిపి ఆవిర్భావించాక చోటుచేసుకోలేదు. అధికారపక్షం ఇంత ఘోర ఓటమిని మూటగట్టుకున్న పరిస్థితి లేదు. ప్రధానంగా గోదావరి జిల్లాలు వరి, ఆక్వా, ఉద్యాన పంటలకు నిలయాలు. డబ్ల్యుటిఒ షరతులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉంటున్నాయి.
అయితే, వైసిపి ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకోవడానికి ముందస్తుగా మిల్లర్లకు రైతులు సొమ్ము కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది రైతులతోపాటు సామాన్య ప్రజానీకాన్ని కలిచివేసింది. దీంతోపాటు డెల్టా ఆధునికీకరణ చేపట్టకపోవడం, రైతు భరోసా లబ్ధిదారుల కోత, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోవడం, ఆక్వా రంగంలో సీడ్‌, ఫీడ్‌ ధరలు గణనీయంగా పెరగ్గా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, జోన్ల పేరుతో విద్యుత్‌ సబ్సిడీ తొలగించడం వంటి అనేక అంశాలు రైతాంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇక జిల్లాల్లో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా మారడం తీవ్ర అసంతృప్తిని పెంచింది. వీటికి తోడు అభివృద్ధి లేమి, స్థానిక నేతల తీరుతో విసుగు చెందిన గోదావరి ప్రజలు ప్రత్యామ్నాయంగా కన్పించిన టిడిపి కూటమికి జై కొట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

➡️