కార్పొరేట్లకు అమ్ముడుపోయిన ప్రభుత్వాలు

Jan 27,2024 10:48 #corporates, #government, #sold
  • కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే ఉద్యమం
  • దేశ, ప్రజల సంపదను సంపన్నులకు కట్టబెడుతున్న మోడీ
  • రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైక్‌ ర్యాలీలు

ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులకు అమ్ముడుపోయి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, ఈ విధానాలను విడనాడకపోతే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని పలువురు వక్తలు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని ఓడించడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మద్దతు ధరల, రైతు విమోచన చట్టం తేవాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించొద్దని, నాలుగు కార్మిక కోట్లను రద్దు చేయాలని, భూ యాజమాన్య హక్కు చట్టం-2022ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.

విజయవాడలోని మీసాల రాజారావు వంతెన నుంచి పడవల రేవు వరకు బైకులు, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు, పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ బాబూరావు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యం.హరిబాబు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి, భారత్‌ బచావో రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ భాస్కరరావు, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మనువాదం నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామన్నారు. కేంద్రం అనుసరిస్తోన్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల భారత ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపా రు. రాముడిని రాజకీయాల్లోకి లాగి మరలా ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రం చూస్తోందని విమర్శించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతు ఉద్యమం నాటి హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, వ్యవసాయ కార్పొరేటీకరణకు కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని కోరారు. గుంటూరులో బిఆర్‌ స్టేడియం నుంచి చుట్టుగుంట సెంటర్‌ వరకూ ద్విచక్ర వాహన ప్రదర్శన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని కుంచనపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శివనాగరాణి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ తదితరు లు పాల్గొన్నారు. కర్నూలులో కొత్త బస్టాండు నుంచి రాజ్‌ విహార్‌ కూడలి మీదుగా కలెక్టరేట్‌ వరకూ ట్రాక్టర్లు, ఆటోలు, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ శనపేట ికను తయారు చేసి ఊరేగించారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య పాల్గొని మాట్లాడారు. రైతు కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని, రైతులు ఏడాదికిపైగా ఆందోళనలు చేసిన సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గిట్టుబాటు, మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఒంగోలులో బైక్‌, ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాలను తొలగించేందుకు, రైతులను ఆదుకునేందుకు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు పెట్టుబడిపై అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వందేళ్ల నుంచి సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం పదేళ్లలో అణగదొక్కడానికి ప్రయత్నించిందని, అయితే రైతులు, కార్మికులు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశ, ప్రజల సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ జ్యూట్‌మిల్లు, ఓవర్‌బ్రిడ్జి మీదుగా ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ గుండా జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు సాగింది. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి జడ్జి కోర్టు మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మీదుగా తిరిగి జివిఎంసి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రారంభించి, మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, దానికి మద్దతు ఇస్తున్న వారిని ఓడించడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగలమన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని విమర్శించారు. అనకాపల్లిలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో నిరసనలు జరిగాయి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు పాల్గొన్నారు. నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, ఉమ్మడి కడప జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.

➡️