ఉపాధి హామీ భిక్ష కాదు.. పేదల హక్కు

May 24,2024 07:52 #Employment, #guarantee

– వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా) :ఉపాధి హామీ చట్టం భిక్ష కాదని,పేదల హక్కు అని, ఉపాధిని రక్షించుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా హార్సిలీహిల్స్‌లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని ప్రమాదంలో పడేశాయన్నారు. విపత్తుల సమయంలో పేదలను ఆదుకున్నది ఉపాధి హామీ పథకమేనని పేర్కొన్నారు. మరోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతాయని హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం, భూ సీలింగ్‌ చట్టం, 2013 భూ సేకరణ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. దున్నే వాడికి భూమి హక్కుగా పేదలకు భూములు పంచాలని, లేనిపక్షంలో భూములను వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేదలకు పంచుతామని చెప్పారు. దేశంలో ఎన్‌డిఎ ప్రభుత్వం పేదలను విభజించి, పాలించు పేరుతో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని తెలిపారు. దేశంలో మతతత్వ బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను విస్మరించి మోసం చేస్తున్నాయని, మతోన్మాద బిజెపిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాయని విమర్శించారు. భూమి, ఉపాధి పరిరక్షణ కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసి పరిష్కరించుకోవాలని కోరారు. సమావేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు విక్రమ్‌సింగ్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ పి.శ్రీనివాసులు, కె.రవి, కెవి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️