‘గుండ్లకమ్మ’పై ఏడాదిగా నిర్లక్ష్యం!

Dec 10,2023 00:30 #damage, #Irrigation Projects, #Ongole
gudlakamma gate damage

-మరమ్మతులకు నోచుకోని రిజర్వాయర్‌ గేట్లు

-మరో గేటు కొట్టుకుపోవడంతో నీరు సముద్రం పాలు

-భారీగా నీరు వస్తుండడంతో మరమ్మతులకూ ప్రస్తుతం ఆటంకం

-ముందే మేలుకుంటే కరువులో 80 వేలు ఎకరాలకు నీళ్లు అందేవి

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరోప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ఆయకట్టు రైతుల ఆశలు నీరుగారాయి. ఈ రిజర్వాయర్‌ గేటు శుక్రవారం కొట్టుకుపోవడంతో నీరు సముద్రం పాలవుతోంది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విపత్తుకు కారణమని వాపోతున్నారు. గుడ్లకమ్మ రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టిఎంసిలు. దీనికి 15 గేట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని గేట్లు దెబ్బతిన్నాయి. నిర్వహణలోపం, చాలా కాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో గతేడాది ఆగస్టు నెలాఖరులో మూడో గేటు కొట్టుకుపోయింది. సుమారు రెండు టిఎంసిల నీరు, కోట్ల రూపాయల విలువైన మత్స్యసంపద సముద్రం పాలైంది. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు డిసెంబరులోపు మరమ్మతులు చేపట్టి సాగర్‌ జలాలను ఇక్కడకు తెచ్చి రైతులకు సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. కొట్టుకుపోయిన గేటుకు తాత్కాలికంగా ఎలిమెంట్లు పెట్టి నీటిని నిలిపారు. పూర్తి స్థాయి రిపేర్ల కోసం ఆరుసార్లు టెండర్లు పిలిచినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. గతంలో చేసిన పనుల బిల్లులు పెండింగ్‌ ఉండడం, కొత్తగా పని చేసినా బిల్లులు వస్తాయని నమ్మకం లేకపోవడం ఇందుకు కారణం. మిచౌంగ్‌ తుపాను కారణంగా జిల్లాలో రెండు రోజులపాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు పడ్డాయి. నల్లమల అడవుల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శుక్రవారం రాత్రికి జలాశయం నిండుకుండగా మారింది. నీటి ఉధృతికి రెండో గేటు కింద భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. గేటు నుంచి భారీగా దిగువకు వెళ్లిపోతున్న నీటిని ఆపేందుకు ఇంజనీరింగు అధికారులు చేసి ప్రయత్నాలు ఫలించలేదు. రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గితే తప్ప అక్కడ తాత్కాలికంగా ఎలిమెంట్లు పెట్టే పరిస్థితి లేదు. దీంతో, కొన్ని గేట్లు కొద్దిగా ఎత్తి నీటిని వృథాగా సముద్రంలోకి దిగువకు వదులుతున్నారు. దీంతో, రిజర్వాయర్‌ ఇప్పటికే సగం ఖాళీ అయింది. గుండ్లకమ్మ కుడిఎడమ కాలువ ద్వారా రబీలో 80 వేల ఎకరాలకు ఆరుతడి పంటలకు నీరివ్వడానికి సరిపడా నీరు రిజర్వాయర్‌లో ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీని కరువు వెంటాడింది. అయితే, డిసెంబర్‌లో వచ్చిన తుపాను వల్ల డ్యాము నిండడంతో పొగాకు, మిర్చి పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశించారు. ఇప్పుడు రెండో గేటు కొట్టుకుపోవడంతో వారి ఆశలు నీరుగారాయి. ఈ నేపథ్యంలో రూ.9 కోట్లతో టెండర్లు ఫైనల్‌ అయినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు.పత్తాలేని పాలకపక్ష నేతలు…డ్యాంను సందర్శించిన టిడిపి ఎమ్మెల్యేలు, రైతు, కౌలు సంఘాల నాయకులుగుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడంతో పాలకపక్ష నేతలు ఎవరూ కనిపించలేదు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తన అతిథి గృహం నుంచి ఇదే మార్గంలో వెళ్లినా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. మంత్రిగానీ, జిల్లాలోని సీనియర్‌ ఎమ్మెల్యేలుగానీ పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డోలా వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బిఎన్‌ విజయకుమార్‌, ముత్తుమల అశోక్‌రెడ్డి, ఎపి రైతు, ఎపి కౌలు రైతు సంఘాల నేతలు పమిడి వెంకట్రావు, ఎస్‌కె మాబు, జె.జయంతిబాబు, బాలకోటయ్య తదితరులు కొట్టుకుపోయిన గేటును, వృథాగాపోతున్న నీటిని పరిశీలించారు. తక్షణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ విపత్తు జరిగిందన్నారు.

➡️