కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. విభజన సమస్యల పరిష్కారమన్న మంత్రి బుగ్గన

Feb 8,2024 08:38 #ap budget, #Finance Ministry
Gurukul Upadhyay problems should be discussed with the help of the central government

రూ.2.86 లక్షల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సాధికారత దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని, స్ఫూర్తిదాయక పథకాలు, విస్తృత విధివిధానాల సమ్మిళితంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను ఎవరికివారే ముందుకు తీసుకెళ్లే విధంగా స్వయం సాధికారత దిశలో నడిపిస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలు, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ను అసెంబ్లీలో ప్రతిపాదించారు. శాసనమండలిలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల, శ్రేయోరాజ్యస్థాపన జరిగిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్లతో బడ్జెట్‌ అంచనాలు ప్రతిపాదించారు. ప్రసంగంలో 17 సూక్తూలు ప్రస్తావించారు. ఈసారి ప్రసంగం సుదీర్ఘసమయం సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్న సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందిన వారి అభిప్రాయాలను స్లైడ్‌ రూపంలో ప్రదర్శించారు. ప్రసంగం సాగుతున్న సమయంలో ఏ జిల్లా ప్రాజెక్టు వస్తే ఆ జిల్లా నాయకులను ఆయన స్పందించాలని సూచనలు చేశారు. కర్నూలు జిల్లా ప్రాజెక్టులు వచ్చిన సమయంలో ఆ జిల్లా వారు స్పందించాలని కోరినా స్పందన కనిపించలేదు. రెండోసారి మరలా ప్రస్తావించారు. అలాగే విద్యాశాఖ గురించి మాట్లాడుతున్న సమయంలో మంత్రి బొత్స పేరును ప్రస్తావించారు. దీంతో సభ్యులు అప్పుడప్పుడు బల్లలు చరుస్తూ ఉత్సాహపరిచారు. దాదాపు లక్షా 35 వేల మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని, 2 లక్షల 66 వేల మంది వలంటీర్ల నియామకం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటాను, మిగతా అన్ని కోర్సుల్లో 35 శాతం కోటాను ప్రభుత్వ కోటాగా కేటాయించామన్నారు. 2024-25 బడ్జెట్‌ అంచనా రూ.2,30,110.412 కోట్లుగానూ, మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు దాదాపు రూ.24,758.22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లుగా అంచనాలు సమర్పించారు. ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 3.51 శాతం, రెవెన్యూలోటు 1.56 శాతమని పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై వరకూ ఈ అంచనాలు అమల్లో ఉంటాయి. పూర్తిస్థాయి పెట్టుబడి అంచనాలు, సవివర ప్రతిపాదనలు ఎన్నికల అనంతరం రాబోయే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. 2024 మార్చి 31 వరకూ సవరించిన అంచనాలనూ ప్రతిపాదించారు. మూస పద్ధతుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించలేమని ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వారా తెలుసుకున్నామని, దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు రూపొందించి గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని అన్నారు. పాలనా వికేంద్రీకరణతో గడప గడపకే ప్రభుత్వం అనే విధానాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

➡️