ఐదేళ్లుగా అరకొర వేతనాలే

ఒక్కటంటే ఒక్క ఇంక్రిమెంటు కూడా ఇవ్వని ప్రభుత్వం

కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ ధర్నా

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ జెఎసి మద్దతు

సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ (సిహెచ్‌ఒలు) పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఐదేళ్లుగా వీరికి అరకొర వేతనాలే ఇస్తూ ఒక్కటంటే ఒక్క ఇంక్రిమెంటు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో వారంతా ఉద్యమబాట పట్టారు. గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఆధ్రప్రదేశ్‌ కమ్యూనిటి హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో సిహెచ్‌ఓలు ధర్నా నిర్వహించారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌ జెఎసి ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లలో పని చేస్తున్న కమ్యూనిటి హెల్త్‌ ఆఫీసర్స్‌ (సిహెచ్‌ఓ)ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనలేని సేవలందిస్తున్న సిహెచ్‌ఒలకు ఐదేళ్లుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పని చేయించుకోవడం తగదన్నారు.

నివాసయోగ్యంలేని రీతిలో ఎలాంటి సౌకర్యాలు లేని ఊరిబయట క్వార్టర్లు నిర్మించి అందులో ఉంటున్నారని చెబుతూ ఆ సాకుతో హెచ్‌ఆర్‌ఎను కూడా కోత పెట్టడం సరైందికాదన్నారు. ఆరు నెలలుగా అద్దెలను, ఇన్సింటివ్‌లను నిలిపివేశారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరికీ వేతనాలను పెంచి సిహెచ్‌ఓలకు పెంచకపోవడం అన్యాయమని అన్నారు. ఎన్‌హెచ్‌ఎంలకు అమలు చేసినట్లుగా సిహెచ్‌ఓలకు కూడా 23 శాతం పెంచుతూ వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. సిహెచ్‌ఓలకు రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్స్‌లకు ఇచ్చే పే స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే రాత్రి పూట ముఖ ఆధారిత హాజరును రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా సిహెచ్‌ఓలకు పదోన్నతులను కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇఎస్‌ఐ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సిహెచ్‌ఓల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓల అసోషియేషన్‌ నాయకులు పులి ప్రేమ్‌కుమార్‌, రాజేశ్వరి, సిద్ధయ్య తదితరులు పాల్గన్నారు.

➡️