గ్రూప్‌-1 మెయిన్స్‌ అప్పీల్‌పై నేడు విచారణ

ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. డివిజన్‌ బెంచ్‌లోని న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌ బుధవారం సెలవు పెట్టడంతో విచారణ వాయిదా పడింది.

మరో పిల్‌ కొట్టివేత
హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ దాఖలైన మరో పిల్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు కేంద్రం చట్టం చేసేలా ఉత్తర్వులు ఇవ్వలేమని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. ఎపి, తెలంగాణ ఆస్తి, అప్పుల విభజన జరగనందున హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగానే కొనసాగించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ నెల్లూరు జిల్లా, అక్కంపేటకు చెందిన నారపరెడ్డి కిరణ్‌కుమార్‌ వేసిన పిల్‌ను కొట్టేసింది. గతంలో ఇదే తరహా పిల్‌ను హైకోర్టు కొట్టేసిందని రాష్ట్రం గుర్తు చేసింది.

డిఎస్‌సి నిలుపుదలకు నిరాకరణ
టీచర్‌ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్‌సి ప్రక్రియ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. హడావుడిగా పిటిషన్‌ దాఖలు చేసి మధ్యంతర ఆదేశాలు కోరితే ఎలాగని పిటిషనరును హైకోర్టు ప్రశ్నించింది. విచారణను మే ఒకటికి వాయిదా వేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత లున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకే విధానం ఉండాలంటూ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ పిల్‌ దాఖ లు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాల జిఓ 11, అలాగే ప్రిన్సిపల్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల మార్గదర్శకాల జిఓ 12ను రద్దు చేయాలని కోరారు.

రాజధాని రైతులకు కౌలుపై పిల్‌
అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులకు సంబంధించిన సిఆర్‌డిఎ చట్ట నిబంధనలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల కోసం రూ.240 కోట్ల నగదు కేటాయిస్తూ 2023 మే 5న జిఓ 286 జారీ చేయడాన్ని విశాఖకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ నార్త్‌ ఆంధ్రా జిల్లాల అధ్యక్షులు పాక సత్యనారాయణ సవాల్‌ చేశారు. ఈ పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

ఎపి క్యాపిటల్‌ సిటీ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (ఫార్ములేషన్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌) రూల్స్‌ 2015, ఎపి ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ రూల్స్‌ 2017ను శాసనసభలో ప్రవేశపెట్టలేదని, సభ అనుమతి లేకుండా నాటి ప్రభుత్వం పరిహారం చెల్లింపుల నిబంధనలను తేవడం చెల్లదని పిటిషనరు తరఫున న్యాయవాది విఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదించారు. సిఆర్‌డిఎ 2014 చట్టంలో ఎక్కడా కూడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదన్నారు. సిఆర్‌డిఎ చట్టంలోని సెక్షన్‌ 53(1)(డి) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదలకు నివాస స్థలాలు కేటాయింపు చేయాలన్నారు. రైతుల తరఫున ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలుకు అనుమతించాలని న్యాయవాది కోరడంతో హైకోర్టు అనుమతినిచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

➡️