ఉదారంగా సాయం చేయండి

Dec 16,2023 10:30 #CM YS Jagan

కేంద్రబృందాలతో సిఎం జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా సిఫార్సులు చేయాలని కేంద్రబృందాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. మిచౌంగ్‌ తుపాను,కరువు పరిస్థితులపై కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్తా ప్రాంతంలో విస్తృత వర్షాలకు తుపాను కారణమైందని తెలిపారు. దీనివల్ల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇ-క్రాపింగ్‌ వంటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం పెడతామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ముందుగానే అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిందని కేంద్రబృందం సభ్యులు సిఎంతో అన్నారు. పంట నష్టం, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. కరువుకు సంబంధించి అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించామని తెలిపారు.

➡️