హయ్యర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలి

Feb 5,2024 20:41 #Dharna, #Pensioners
  • ఎపిఆర్‌పిఎ ఆధ్వర్యంలో పెన్షనర్ల నిరసన దీక్ష

ప్రజాశక్తి – యంత్రాంగం : ఇపిఎస్‌ పెన్షనర్లందరికీ హయ్యర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలని, కనీస పెన్షన్‌గా రూ.తొమ్మిది వేలు అందజేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగారు. ప్రావిడెండ్‌ ఫండ్‌ కార్యాలయాల ఎదుట, కలెక్టరేట్ల ఎదుట దీక్షలు ప్రారంభించారు. ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన (ఎపిఆర్‌పిఎ) సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని, డిఎ అందజేయాలని నినదించారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదో తేదీ వరకూ దీక్షలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.విశాఖ మర్రిపాలెంలోని రీజనల్‌ పిఎఫ్‌ ఆఫీస్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. షిప్‌యార్డు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారినుద్దేశించి అసోసియేషన్‌ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్‌ మాట్లాడుతూ.. కనీస పెన్షన్‌ రూ. తొమ్మిది వేలతో పాటు డిఎ అనుసంధానం చేయాలని, భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. రైల్వే రాయితీని పునరుద్ధరించాలని కోరారు.ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిఆర్‌పిఎ జిల్లా గౌరవాధ్యక్షులు ఏవి పుల్లారావు మాట్లాడుతూ.. పెన్షనర్లకు పిఆర్‌సి బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అల్‌ పెన్షనర్స్‌ , రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి. శేషయ్య, సిహెచ్‌ రాంబాబు మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈనెల ఎనిమిది వరకు కొనసాగుతాయని తెలియజేశారు. నెల్లూరు ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఎపిఆర్‌పిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్రమౌళి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరైన పెన్షనర్లందరూ మెడలో ఎర్రరిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ సమీపాన జ్యోతిరావుఫూలే పార్కు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

➡️