ఈ సారి నాకు టిక్కెట్టు లేదు : ఫేస్‌బుక్‌లో కేశినేని నాని

Jan 6,2024 09:40 #Facebook, #Keshineni Nani, #Tickets

ప్రజాశక్తి- విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఈసారి తనకు టిక్కెట్టు ఇవ్వడం లేదని, లోక్‌సభకు తన స్థానంలో వేరొకరిని బరిలోకి దింపుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని నాని తెలిపారు. ఫేస్‌బుక్‌ వేదికగా శుక్రవారం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘ అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం. మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరేవారిని ఇన్‌ఛార్జిగా నియమించారని చెప్పారు. ఆ విషయంలో ఇక జోక్యం చేసుకోవద్దన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా నా స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. అధినేత ఆజ్ఞలను తూ.చా తప్పకుండా పాటిస్తానని నేను వారికి చెప్పా’ అని పేస్‌బుక్‌లో ఆయన చేసిన వ్యాఖ్య కలకలం రేపింది పెద్ద సంఖ్యలో నాని అభిమానులు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. నానికి మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని ప్రజల ఆశీస్సులతో మూడోసారి కూడా తానే విజయవాడ ఎంపి అవుతానని చెప్పారు. మీడియా వేసిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ… కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇప్పటికీ తాను టిడిపిలోనే ఉన్నానని చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అని గతంలోనే తాను చెప్పానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసైనా గెలుపొందుతాననే ధీమా తనకుందని అన్నారు. తనను నమ్ముకున్న అభిమానులతో చర్చించిన తరువాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

➡️