కూటమి గెలిస్తే పథకాలు ఉండవు

May 10,2024 20:42 #ap cm jagan

– ‘ఫ్యాన్‌’ వస్తేనే సంక్షేమం కొనసాగింపు

– మోడీ సభల్లో ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించగలరా?
-మంగళగిరి, పుత్తూరు, కడప సభల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – యంత్రాంగం:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు నమ్మి మోసపోవద్దని, పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని, చంద్రబాబు గెలిస్తే పథకాలు ఉండవు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ మరణాంతరం తమను కాంగ్రెస్‌ ఇబ్బందులకు గురిచేసిందని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పార్టీ గుర్తు ప్రకటించని రోజుల్లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిస్తే 5.45 లక్షల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ పేరును అప్రతిష్టపాలు చేయాలని, దేశంలోని అన్ని వ్యవస్థల్ని ఉసిగొల్పిన వారితో చేతులు కలిపిన వారా? వారసులని ఎద్దేవా చేశారు. నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చిన పార్టీతో కలిసి, రాష్ట్ర విభజన చేసిన పార్టీలతో జత కట్టాలా అని నిలదీశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, చిత్తూరు జిల్లా పుత్తూరు, కడపలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇచ్చినవి కానేకావని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల్లో పేదలు ఉన్నట్లే ముస్లిముల్లో కూడా పేదలున్నారన్నారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ వంటి అంశాల్లోనూ మద్దతుగా నిలుస్తానన్నారు. ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించే ఎన్‌డిఎ కూటమిలోనే చేరి, కల్లబల్లి మాటలు, మోసాలతో కూడిన దొంగప్రేమను చంద్రబాబు ఒలకబోస్తున్నారని విమర్శించారు. మోడీ సభలో ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించగలడా? అని ప్రశ్నించారు. 59 నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. రెండు లక్షల 70 వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులను మార్చడానికి ప్రయత్నించామని తెలిపారు. ఇది ఓర్వలేని టిడిపి కూటమి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. వారి మాటలు నమ్మవద్దని, గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వివరించారు. మరల సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారని, వారిని ఓడించాలని కోరారు. 93 శాతం ప్రజలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పించామన్నారు. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని చెప్పారు. ఇలాంటి విప్లవాత్మకమైన పథకాలు ఎపుడైనా జరిగాయా? అని ఓటర్లను ప్రశ్నించారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు పలికినట్లేనన్నారు. మూడు రోజుల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపిలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్లు మీ ఇంటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నిక అభివృద్ధిని నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు. గుంటూరు ఎంపి అభ్యర్థి కిలారి రోశయ్య మాట్లాడుతూ.. కుబేరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఎన్నికలు అయ్యాక వాళ్లు కనిపించరని, మీ ముందు ఉండే తనను, లావణ్యను గెలిపించాలని కోరారు.

➡️