పార్టీ ఆదేశిస్తే ఆంధ్రలోనే కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తా : వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ,కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తాననన్నారు. పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్‌ కాదు, అండమాన్‌ లోనైనా పని చేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు.. పార్టీలో తనకు ఏ బాధ్యత ఇస్తారనేది రెండు రోజుల్లో తేలుతుందని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ఆశయమన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడం కోసం పార్టీలో చేరానని, అందుకోసం పని చేస్తానని పేర్కొన్నారు. ఒక క్రిస్టియన్‌ గా మణిపూర్‌ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని, సెక్యులర్‌ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనమని బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత్‌ జోడో యాత్ర తనతో పాటు ప్రజలందరిలో రాహుల్‌ గాంధీ పై నమ్మకాన్ని పెంచిందన్నారు.

ఎపిలో జగన్‌ ఓటమి ఖాయం: మాణిక్కం ఠాకూర్‌

ఏపిలో సిఎం జగన్‌ ఓటమి ఖాయమని ఏపి కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ అన్నారు. వైసిపి గ్రౌండ్‌ కోల్పోతుందని, ఆ పార్టీని జగన్‌ పార్టీగా మాత్రమే పిలుస్తున్నారని చెప్పారు. ఏపిలో ఇండియా ఫోరమ్‌లో ఉన్న పార్టీలతో పొత్తులు ఉంటాయని సూచాయగా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పాలనకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని, వైఎస్‌ఆర్‌ పేరును వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని చెప్పారు.

పార్టీ కోసం పిసిసి పదవిని వదులుకునేందుకు సిద్ధం : గిడుగు రుద్రరాజు

పార్టీ కోసం తన పిసిసి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. గాంధీ కుటుంబం త్యాగం ముందు తన త్యాగం ఓ లెక్కా అని అన్నారు. షర్మిల చేరిక కాంగ్రెస్‌ పార్టీకి బలం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో జగన్‌ ను, కేంద్రంలో మోడీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

➡️