తెలంగాణ ఎప్‌సెట్‌లో మన రాష్ట్ర విద్యార్థులకే టాప్‌ ర్యాంకులు

May 18,2024 22:08 #m set, #Telangana
  •  ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం
  •  ఇంజనీరింగ్‌లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్‌లో ప్రణీత ప్రథమం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) రాత పరీక్షల ఫలితాలను విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో విడుదల చేశారు. ఎప్‌సెట్‌ ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్ధులు టాప్‌ ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో టాప్‌ టెన్‌లో ఐదు చొప్పున ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి రెండు ర్యాంకులతోపాటు 5, 6, 8, 10 ర్యాంకుల్లో తెచ్చుకున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో కూడా మొదటి రెండు ర్యాంకులతోపాటు 4, 7, 10 ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లోనూ ఎక్కువ మంది అమ్మాయిలే అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది అర్హులయ్యారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి 89.67 శాతం మంది అర్హత సాధించారు.

➡️