పండుగ మీకు పస్తులు మాకా?

Dec 26,2023 08:49 #Anganwadi strike
  • సమ్మె శిబిరాల వద్ద క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసిన అంగన్‌వాడీలు
  • రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజుకు చేరిన నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలని క్రిస్మస్‌ను పురస్కరించుకుని సమ్మె శిబిరాల వద్ద అంగన్‌వాడీలు క్రిస్మస్‌ కేక్‌కు కట్‌ చేసి నిరసనలు తెలిపారు. ‘పండుగ మీకు.. పస్తులు మాకా’ అంటూ ప్లకార్డులు చేతబూనారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె సోమవారానికి 14 రోజులకు చేరుకుంది. మొక్కవోని దీక్షతో క్రిస్మస్‌ రోజూ కూడా తమ నిరసనను కొనసాగించారు.

విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులతో కలిసి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సమ్మెకు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, అధ్యక్షులు జి. బేబిరాణి మద్దతునిచ్చి మాట్లాడారు. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నెల 29న రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీలకిచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.26 వేలు, సుప్రీంకోర్టు తీర్పుననుసరించి గ్రాట్యూటీ మంజూరు, పని భారం తగ్గింపు తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద సమ్మె కొనసాగింది.

‘పండగ పూట మాకు ఇదేం ఖర్మ’ అని అంగన్‌వాడీలు బాపట్లలో తలపట్టుకొని రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ‘పండుగ మీకు.. పస్తులు మాకా’ అంటూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద, జగ్గంపేటలో సమ్మె శిబిరం వద్ద ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. రామచంద్రపురంలో ఉద్యమ గీతాలు పాడుతూ నిరసన తెలిపారు. తూర్పు గోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోననసీమ జిల్లాల్లో సమ్మె శిబిరాల వద్దే క్రిస్మస్‌ కేక్‌ కట్‌చేసి నిరసన తెలియజేశారు. యేసయ్య మీరైనా సిఎం జగన్‌ మనసు మార్చాలని, అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని విజయనగరం కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో అభ్యర్థించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రార్థనలు చేశారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో చర్చిల వద్ద, సమ్మె శిబిరాల వద్ద కేక్‌ కట్‌ చేశారు. ఓబుళదేవరచెరువు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, చిలమత్తూరులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాణి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా రుద్రవరంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట, కొలిమిగుండ్లలో చెవిలో పువ్వులు పెట్టుకుని, సంజామలలో శివాలయంలో పొర్లుదండాలు, చాగలమర్రిలో జలదీక్షలతో నిరసన తెలిపారు. కర్నూలులో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. నెల్లూరులో విఆర్‌సి క్రీడా మైదానం నుంచి వైఎంసిఎ గ్రౌండ్‌ సమీపంలోని జీసస్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో ‘హిందూ ముస్లిం క్రైస్తవులు భాయిభాయి’ అంటూ సహఫంక్తి భోజనాలు చేశారు. పుత్తూరు టౌన్‌లో అంబేద్కర్‌ సర్కిల్‌ ఎదురుగా ‘షూ’ పాలిష్‌చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.

శ్రీకాకుళంలో శిలువ ఆకారంలో నిరసన తెలిపారు. పలాసలో అంగన్‌వాడీల పోరాటానికి విశ్రాంత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి, సామాజిక కార్యకర్త జుత్తు తాతారావు రూ.ఐదు వేలు, వజ్రపుకొత్తూరు యుటిఎఫ్‌ నాయకులు బి.చిట్టిబాబు రూ.ఐదు వేలు ఆర్థికసాయం అందజేశారు.విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఓ అంగన్‌వాడీ మహిళ శిలువకు వేలాడుతూ నిరసన తెలిపారు. తగరపువలసలోని అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్‌ సందర్శించి, పోరాటానికి సంఘీభావం తెలిపారు.అల్లూరి జిల్లాలో పలుచోట్ల సమ్మె శిబిరాల్లోనే క్రిస్మిస్‌ వేడుకలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు నాసిరకమైనవని, పూజ చేసుకోవడానికి మినహా ఎందుకూ పనికిరావంటూ, యూనిఫామ్‌కు కూడా పూజ చేసి వినూత్న నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో సమ్మె కొనసాగించారు. ఏలూరులో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.

బిజెపి నేతలను నిలదీసిన అంగన్‌వాడీలు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో స్థానిక బిజెపి నాయకులు మద్దతివ్వడానికి రాగా అంగన్‌వాడీలు నిలదీశారు. ‘కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా.. అంగన్‌వాడీలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెలకు రూ.26 వేలు ఇప్పించండి. అప్పుడే మా దగ్గరకు రండి’ అని తెగేసిచెప్పారు. దీంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ కారును అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. దీంతో ఆమె కారు దిగి..అంగన్‌వాడీల వద్దకు వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించేలా సిఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆమెకు అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు.

➡️