రాష్ట్రంలో పరిపాలన ఉందా..!

cpm vsr press meet on workers employees strike in ap

– ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా ?

– ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమనడం నేరమా ?

– 9 నుంచి ఏలూరు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి : వి.శ్రీనివాసరావు

– అంగన్‌వాడీ, సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాలకు వెళ్లి మద్దతు

ప్రజాశక్తి -ఏలూరు ప్రతినిధి, ఏలూరు అర్బన్‌ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. లేక స్తంభించిపోయిందా అనే అనుమానం నెలకొందని, వివిధ తరగతుల ప్రజలు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు, జిల్లా సమాగ్రాభివృద్ధి సదస్సుకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం పరిశీలనకు విచ్చేసిన ఆయన స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ, కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ, సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాల వద్ద మాట్లాడారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులతోపాటు అనేక తరగతుల ఉద్యోగులు తమ సమస్యలపై రోడ్డెక్కి పోరాడుతున్నా తమకు తెలియనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం జగన్‌ చుట్టూ, జగన్‌ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. అంగన్‌వాడీలను పిలిపించి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుండా బెదిరించి భయపెట్టే పరిస్థితి కన్పిస్తోందని, ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఐదో తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరకపోతే టెర్మినేట్‌ చేస్తామంటున్నారని.. మరో రెండునెలలు ఆగితే వైసిపి ప్రభుత్వాన్నే ప్రజలే టెర్మినేట్‌ చేస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే కిట్లు పంపిణీ చేయాలని చూస్తున్నారని, దీన్ని తల్లులు వ్యతిరేకించాలన్నారు. కోరారు. మహిళలు, యువత, విద్యార్థి సంఘాలు, సర్పంచులంతా అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయమని ఉద్యోగులంతా కోరుతున్నారని, ఇది నేరమా? అంటూ ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఆ శాఖ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు బెదిరించినట్లు మాట్లాడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆయన వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆ చట్టం ద్వారా రైతులు శాశ్వత భూహక్కును కోల్పోతారన్నారు. బడాబాబులకు భూసేకరణకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ చట్టం తెచ్చారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై బిజెపి నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. రెవెన్యూ లోటు, పోలవరానికి నిధులు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఏ ఒక్కటీ బిజెపి ఇవ్వలేదన్నారు. విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర హక్కులపై పోరాడాల్సిన ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలోని బిజెపికి దాసోహమంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన వీరంతా ఇప్పుడు భజన చేస్తున్నారన్నారు. బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలతో ఎన్నికల్లో పొత్తులు ఉండవని, బలం ఉన్న స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తుందని, బిజెపి వ్యతిరేక శక్తులతో మాట్లాడతామని చెప్పారు.రాష్ట్రకమిటీ సమావేశాలను జయప్రదం చేయండి ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఏలూరులో జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు, జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు జయప్రదం చేసేందుకు ప్రజలు సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని శ్రీనివాసరావు కోరారు. ఈసమావేశాల్లో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ.బేబి పాల్గంటారన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 80 మంది ప్రతినిధులు పాల్గంటారని తెలిపారు. బిజెపిని, మిత్రపక్షాలను ఓడించడం, వామపక్షశక్తుల ఐక్యత, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎత్తుగడలు, ప్రజా సమస్యలపై చర్చలు వంటివి జరగనున్నాయని చెప్పారు. ఈ కార్యమ్రకంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ పాల్గొన్నారు.

 

municipal workers strike 10th day vsr

 

anaganwadi workers strike 24th day vsr

 

➡️