పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామీణ పేదలను సంఘటితం చేయడంలో వ్యవసాయ కార్మికులు కీలక పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గ్రామీణ పెత్తందార్లకు వ్యతిరేకంగా రైతులు, కౌలు రైతులు.. గ్రామీణ శ్రామికులతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉవ్వెత్తున్న ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యమంపై నిర్బంధకాండను అమలు చేస్తోందని తెలిపారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, బిజెపిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఆయన కోరారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల కార్మికులకు పని దినాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి వెసులుబాటుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపుని చ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు, కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్‌ వంకాయలపాటి శివనాగరాణి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు తదితరులు ప్రసంగించారు.

ఎస్మా ప్రయోగిస్తే పతనం ఖాయం : వెంకట్‌

అంగన్‌వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తప్పుపట్టారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని తెలిపారు. దేశ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన బిజెపిని, దానికి వంత పాడే పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15 వరకు జనజాగరణ సదస్సులు, 26న దేశ వ్యాప్తంగా ట్రాక్టర్‌ ర్యాలీలు, నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో కార్మికులతో ర్యాలీలు, సదస్సులు, హర్తాళ్‌, గ్రామీణ బంద్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.

➡️