సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు :  సజ్జల రామకృష్ణారెడ్డి

Doubts-on-Chandrababu%27s-medical-report-Sajjala

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కే డ్రామాలాడే అవసరం వుందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టిడిపి నేతలు.. ఎలాంటి వైఫల్యమో చెప్పలేకపోతున్నారని అన్నారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒకవైపు దాడిని ఖండిస్తున్నామంటూనే డ్రామాలు అని తన ద్వంద్వ బుద్ధిని ప్రదర్శించారని విమర్శించారు. ఈ ఘటనను డ్రామాలంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా? అని ప్రశ్నించారు.

బాలకృష్ణ, పవన్‌పై ఇసికి ఫిర్యాదు
ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. సిఇఒ ఎంకె మీనాకు వైసిపికి చెందిన ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి సోమవారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో, ఈ నెల 14న తెనాలిలో పవన్‌కల్యాణ్‌ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించి సిఎం జగన్‌పై వ్యక్తిగత ధూషణలు చేశారని తెలిపారు.

➡️