రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా నిర్ణయాలు సరికావు

May 3,2024 15:35 #letter, #Nara Chandrababu
  • సిఎస్‌కు చంద్రబాబు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరమని, అత్యంత దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్ధిదారుల్ని వేధించి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. పింఛన్ల పంపిణీపై సిఎస్‌కు చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర పింఛనుదారులు ఇబ్బందులు పడకుండా పెన్షన్‌ పంపిణీ సకాలంలో జరగాలని ఎన్నికల కమిషన్‌ ఏప్రిల్‌ 2న మెమోలో పేర్కొన్నదని తెలిపారు. అయినా ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ గత నెలలో 33 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ఈ నెల కూడా పింఛనుదారులను రోడ్లపై మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి నరకయాతనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నప్పటికీ ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేశారని, వాటిని తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించి చెప్పిస్తున్నారని పేర్కొన్నారు. అలా చెప్పే సమయంలో పెన్షన్‌ పంపిణీ పూర్తిచేసే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా రాజకీయ కుట్రలకు ప్రాధాన్యమివ్వడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో ప్రభుత్వ అధికారిగా భాగస్వామిగా మారడం పక్షపాత వైఖరికి నిదర్శమని విమర్శించారు. గత నెలలో 33 మంది చనిపోతే, ఈ నెల ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తక్షణమే ప్రతి లబ్ధిదారుడికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు లేఖ
ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు చంద్రబాబు మరో లేఖ రాశారు. పోస్టింగులు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒకటినే జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనుకాడలేదని పేర్కొన్నారు.

➡️