బిజెపితో అంటకాగటం శోచనీయం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు

ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని అంటకాగటం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అన్నారు. నేడు విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీలో బాబురావు, స్థానిక సిపిఎం నేతలతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసిపి, తెలుగుదేశం నేతలు వేలాది రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వారి డబ్బును తిరస్కరించి నిజాయితీగా నిలబడిన కార్యకర్తలను, శ్రేయోభిలాషులను బాబురావు అభినందించారు. డబ్బు రాజకీయాలతో భవిష్యత్తులో ప్రజలకు తీవ్రమైన నష్టాలు కలుగుతాయని ప్రజలకు వివరించారు. మంచినీటి కాలుష్యం, మురుగు కాలువల్లో కలుషిత నీటితో ఏర్పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు బాబురావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ….. ”దేశవ్యాప్తంగా నిరంకుశ మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వివిధ దశల ఎన్నికల్లో బిజెపి, మోడీ గ్రాఫ్ పడిపోతున్నది. 400 సీట్లు అంటూ మోడీ ప్రజలను మోసగిస్తున్నారు, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అందుకే ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందాలని మోడీ, బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రజలు వాటిని తిప్పి కొడుతున్నారు. దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నా, మన రాష్ట్రంలో తెలుగుదేశం, వైసిపి పార్టీలు ఇంకా బిజెపి, మోడీకి అంటకాగటం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆ పార్టీలు కళ్ళు తెరవాలి, దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగాను, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోను వైసీపీ, తెలుగుదేశం పార్టీలు నోట్లతో ఓట్ల రాజకీయం చేశాయి, పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేశాయి. మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోకపోగా, ప్రజల కళ్ళు కప్పటానికి ప్రార్ధనలయాల్లోనూ నోట్ల రాజకీయం చేశారు. పాపపు సొమ్ముతో ప్రజలను భ్రమల్లో పెట్టడానికి ప్రయత్నించారు. ప్రార్థన ఆలయాలను అపవిత్రం చేశారు, కొందరు ఈ భ్రమలకు లోను కావటం బాధాకరం. కోట్లతో అడ్డగోలు రాజకీయం చేస్తూ అవినీతి వ్యతిరేక పోరాటం అంటూ నీతి కబుర్లు చెప్పటం సిగ్గుచేటు. భవిష్యత్తులో అవినీతి మరింత పెచ్చరిల్లుతుంది, ప్రజల హక్కులను హరిస్తారు. మోసపూరిత వాగ్దానాలు, ధన రాజకీయాల ఎడల ప్రజలు అప్రమత్తంగా లేకపోతే నష్టపోతారు, ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలి. సిపిఎం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎన్నికల అవసరం తీరిపోగానే ప్రజలను గాలికి వదిలేయటం ఇతర పార్టీల నేతల తీరు. దీనికి భిన్నంగా సిపిఎం నేతలు ఎన్నికల అనంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు అండగా నిలుస్తారు. ఎన్నికల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలను విస్మరించింది. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు వారి బాధ్యత నిర్వహించడంలో వైఫల్యం చెందారు. తక్షణ, అత్యవసర సమస్యలను, ఇబ్బందులను అధికారులు, పాలకులు పరిష్కరించాలి. సంక్షేమ పథకాలకు ఎంతోమందికి లబ్ధి చేకూరలేదు, నగదు జమ కాలేదు. పోలింగ్ ముందు హడావిడి చేసిన పాలకులు, అధికార యంత్రాంగం నేడు నత్త నడకన సాగుతోంది. ఓట్ల కోసం నోట్లు కురిపించిన నేతలు సంక్షేమ పథకాల నగదును జమ చేయించడంలో వైఫల్యం చెందుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే నగదు విడుదల చేసి తమ చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలి” అని అన్నారు. నేడు జరిగిన ఈ పర్యటనలో సిపిఎం నేతలు కే.దుర్గారావు, ఎస్కే పీర్ సాహెబ్, కళ్యాణ్, ఓంకార్, రంగస్వామి, సూరప్పడు, రవి, అప్పన్న, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

➡️