ఉపాధి కార్మికుల రూ.600కు పెంచాలి

Apr 7,2024 22:15 #Dharna, #upadi employee

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) :ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు, కార్మికులకు రూ.600కు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధి కార్మికులు ధర్నా చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు గ్రామ శివారు నక్కలపాలెంలో జరిగిన ఈ ధర్నాలో సంఘం నాయకులు బివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెరిగిన ధరలు వంద శాతం ఉంటే ఉపాధి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పది శాతమే కూలి పెంచడం దారుణమన్నారు. దీనిని బట్టి మోడీకి ఉపాధి కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో నిధులు రూ. రెండు లక్షల కోట్లకు పెంచాలని, ఉపాధి కార్మికులకు మనిషికి 100 రోజుల నుంచి 200 రోజులు పనిదినాలు చూపించే వరకు పోరాడాలని కోరారు. నాయకులు కటికల యాకోబు మాట్లాడుతూ మేస్త్రీ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఉపాధి వ్యవస్థని దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించటం దారుణమన్నారు. మేస్త్రీకి జీతం రూ. పది వేలు ఇవ్వాలని, లేదా అదనంగా కార్మికుడుకి రూ.5 ఇవ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం గ్రామ అధ్యక్షులు మాదాసు సుబ్బయ్య మాట్లాడుతూ వేసవిలో అదనపు వేతనం, మజ్జిగ, నీరు, టెంట్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కమ్మగంటి భాస్కరరావు, కె కిషోర్‌, కె బసవయ్య, కె వేణు, జంగం స్వప్న, జంగం బాలు, జంగం మేరీ రాధ, మెండు స్వాతి, గొంతుపూడి జ్యోతి, చిరువోలు సంపూర్ణ, చిరువోలు సుధ పాల్గొన్నారు.

➡️