గిరిజన చట్టాలను తుంగలో తొక్కిన జగన్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్‌ సర్కారు తుంగలో తొక్కిందని, మన్యం స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను అదానీ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పోర్టులు, పవర్‌ ప్రాజెక్టులు, సోలార్‌ విద్యుత్తు ఒప్పందాలు అదానీ కంపెనీలకే అప్పనంగా అప్పగించిందన్నారు. ఇప్పుడు మన్యంలో స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టులనూ అదానీకి కట్టబెడుతూ గిరిజన చట్టాలను, హక్కులను హరిస్తోందన్నారు. గిరిజనేతరులకు ప్రాజెక్టులు ఇవ్వకూడదని గిరిజన చట్టాలు స్పష్టం చేస్తున్నా, జగన్‌ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. 3,400 మెగావాట్ల సామర్ధ్యం గల 3 స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు అదానీ కంపెనీకి 1000 మెగా వాట్ల సామర్ధ్యం గల మరో ప్రాజెక్టు జగన్‌ కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్‌కు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.

➡️