జగన్‌రెడ్డి కుంభకర్ణుడు

Apr 7,2024 21:45 #speech, #ys sharmila

– ‘వివేకా’ హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు
– నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను నిలబడ్డాను
– మూడో రోజు బస్సు యాత్రలో వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి-కమలాపురం (వైఎస్‌ఆర్‌ జిల్లా):సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కుంభకర్ణుడని, నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలేచారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారంనాడు మూడో రోజు బస్సుయాత్ర కొనసాగింది. నియోజకవర్గంలోని కమలాపురం, పెండ్లిమర్రి, విఎన్‌ పల్లె, సికెదిన్నె, చెన్నూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రం అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలమయంగా మారిందన్నారు. ఇసుక, మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ వైఎస్‌ఆర్‌ కల అని అన్నారు. జగన్‌ శంకుస్థాపనలు చేశారే తప్ప ప్రాజెక్టు ముందుకు కదల్లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లయినా ఇంతవరకు హంతకులకు శిక్ష పడలేదని వాపోయారు. హత్యచేసిన వాళ్లు అధికారం అడ్డు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నారని, అన్ని ఆధారులూ ఉన్న చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డే హంతకుడని సిబిఐ చెప్పిందని, అలాంటి వ్యక్తికే జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లేనని అన్నారు. నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే తాను ఎంపిగా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఒక వైపు ధర్మం, మరో వైపు డబ్బు ఉందని, ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయాలని అన్నారు.
ఆదిమూలం శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
పెండ్లిమర్రిమండలం యాదవపురం గ్రామంలో వారం రోజుల కిందట ఆదిమూలం శ్రీనివాస్‌యాదవ్‌ హత్యకు గురికావడంతో ఆయన కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శ్రీనివాస్‌యాదవ్‌ను అత్యంత దారుణంగా కాల్చి హత్య చేశారని పేర్కొన్నారు. నిందితులు ఎంపి వైఎస్‌ అనినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ముఖ్య అనుచరులేనని ఆరోపించారు.
షర్మిలను ఎంపిగా చూడాలనేది వివేకా కోరిక : సునీత
షర్మిలను ఎంపిగా చూడాలని తన తండ్రి కోరిక వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. షర్మిలతో కలసి బస్సుయాత్రలో పాల్గన్న ఆమె మాట్లాడుతూ పక్కా స్కెచ్‌తోనే తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు. వివేకా హత్య విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మాటలూ విడ్డూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

➡️