జగన్‌ దోచుకు తిన్నారు

Feb 27,2024 11:12 #meeting, #Nara Chandrababu, #srikakulam
  • శ్రీకాకుళం సభలో చంద్రబాబు
  • విభజన కంటే వైసిపి పాలనలోనే నష్టం ఎక్కువని విమర్శ

ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : ‘రాష్ట్రాన్ని జగన్‌ దోచుకు తిన్నారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకు తిన్నారు.’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించిన రా కదలి రా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నమ్మి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలను జగన్‌ మోసం చేశారని అన్నారు. ‘ఇప్పుడు మీ ఓటుతో వైసిపిని చిత్తు,చిత్తుగా ఓడించాలి. బంగాళాఖాతంలో కలపాలి’ అని సభకు హాజరైన వారినుద్ధేశించి బాబు అన్నారు. రాష్ట్ర విభజన కంటే జగన్‌ రివర్స్‌ పాలనలోనే ఎక్కువ నష్టపోయామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపి, తెలంగాణ మధ్య తలసరి ఆదాయం వ్యత్యాసం 35 శాతం ఉంటే… 2019 నాటికి దానిని 27 శాతానికి తగ్గించామన్నారు. జగన్‌ వచ్చిన తర్వాత అది 44 శాతానికి చేరిందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తీ ఏడాదికి రూ.80వేల చొప్పున ఆదాయం కోల్పోయాడని చెప్పారు. జగన్‌ ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని విమర్శించారు. బటన్‌ నొక్కి, సహజ వనరులు మింగేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.8 లక్షల అప్పు భారాన్ని ప్రభుత్వం మోపిందన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్లు విడుదల చేస్తామని చెప్పిన జగన్‌, ఐదు జనవరి నెలలు గడిచినా ఇవ్వలేదని అన్నారు. రాబోయే జనవరిలో ఎక్కడ ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలకు బస్సులు, రోడ్లు లేకపోయినా ఎన్నికల్లో తిరగడానికి రూ.20 కోట్లతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున ఘనత జగన్‌దన్నారు. ఉత్తరాంధ్రను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చేశారని చెప్పారు. జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి అని, ఇక్కడి ఉన్న భూములు, గనులపై ప్రేమ తప్ప ఈ ప్రాంతంపై కాదని చెప్పారు. విశాఖలో రూ.40 వేల కోట్లు విలువైన భూములను కొట్టేశారని చెప్పారు. విశాఖ నుంచి పరిశ్రమలు పారిపోయాయని, మెట్రో ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తున్నా జగన్‌ మాట్లాడటం లేదని విమర్శించారు. రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి రూ.2లక్షలతో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచిందని విమర్శించారు. జగన్‌ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాడన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని, చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక దోపిడీని అరికడతామని, మద్యం ధరలను నియంత్రిస్తామని చెప్పారు మత్స్యకారులపై అధ్యయనం చేసి వారి సంక్షేమం కోసం ఒక డిక్లరేషన్‌ ప్రకటిస్తామని చెప్పారు. బిసిల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

➡️