ఎపిపిఎస్‌సిని భ్రష్టు పట్టించిన జగన్‌

Mar 13,2024 23:57 #ap cm jagan, #APPSC, #coments, #Nara Lokesh
  •  హైకోర్టు తీర్పు చెంపపెట్టు: టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిఎస్‌సిని జగన్‌ వైసిపిఎస్‌సిగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. 2018 గ్రూప్‌-1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారించిన హైకోర్టు మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది జగన్‌కు చెంపపెట్టు అని అన్నారు. గ్రూప్‌-1 పేపర్ల మూల్యంకనం ఇష్టారాజ్యంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. ఎటువంటి అర్హతలు లేకున్నా.. వైసిపి నేతలు, జగన్‌ బంధువులను ఎపిపిఎస్‌సి సభ్యులుగా చేసి మొత్తం పరీక్షల వ్యవస్థను, మూల్యాంకనాన్ని, ఇంటర్వ్యూ పద్ధతుల్ని పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఎపిపిఎస్‌సి, ప్రభుత్వ అసమర్ధ పాలనకు అద్దం పడుతోందని టిడిపి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.
ఓటమి భయంతో జగన్‌ టికెట్ల దుకాణం : అచ్చెన్నాయుడు
రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్‌ టికెట్ల దుకాణానికి తెరలేపారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసిపి అభ్యర్థుల నుంచి దాదాపు రూ.వెయ్యికోట్లు వసూలు చేశారని ఒక ప్రకటనలో ఆరోపించారు. చిలకలూరిపేట వైసిపి అభ్యర్థిగా మల్లెల రాజేష్‌ నాయుడును నియమించినందుకు మంత్రి విడదల రజిని, సజ్జల రామకృష్ణారెడ్డి రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సజ్జలతో పాటు రజినిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️