జగన్‌ ప్రభుత్వం కూలిపోతుంది : వర్ల రామయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వైసిపి అహంకార, అరాచక, హింసాత్మకమైన పాలనకు జూన్‌ 4న తెరపడుతుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పష్టమైన మెజార్టీతో టిడిపి గెలవబోతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. బాక్సులు పగలగొడితే రీ పోలింగ్‌ అడగలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. ఇంకా కొంతమంది అధికారులు జగన్‌ సేవలో తరించాలని తపన పడుతున్నారని, ఇకనైనా వారు బయటకు రావాలని అన్నారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి హింసకు పాల్పడిందని టిడిపి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటతోపాటు చాలాచోట్ల విధ్వంసం సృష్టించారని చెప్పారు. 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్‌ వచ్చేది కాదన్నారు. పోలీసుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తాను ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పిన్నెల్లి అరాచకాలకు దళిత, గిరిజనులు సైతం ఇబ్బందులు పడ్డారని టిడిపి ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు ఎం ధారునాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

➡️