జ్యోతిష్యంలో నిజమెంతో తెలిసిందిగా!

Dec 14,2023 07:34 #Astrology
Astrology

తెలంగాణ ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత ఎంతో మంది జాతకాల రాయుళ్లు…ఎక్కడ వెనకబడిపోతామో అనుకొని… వారి వారి జాతక విద్యను పోటీపడి ప్రదర్శించటం మొదలు పెట్టారు. అందరూ కెసిఆర్‌ ముఖ్యమంత్రి ఖాయం అని చెప్పినవారే. ఒకడైతే ఆరు నూరైనా, నూరు ఆరయినా కెసిఆర్‌ ముఖ్యమంత్రేనని ఢంకా కొట్టి చెప్పాడు. వీరంతా భారీ సంభావనలు పుచ్చుకొని ఉంటారు. ఇందంతా అందుకోసమే కదా! మరొకడైతేే కెసిఆర్‌ ముఖ్యమంత్రి కాకపొతే జాతకాలు చెప్పటం మానేస్తానని చెప్పాడు. చీమంత నిజాయతీ ఉన్నా ఆ పని చేస్తే జనాన్ని ఈ పిచ్చి నుండి కాపాడినవాడౌతాడు. ఇక కెసిఆర్‌ తను మూడోసారి ముఖ్యమంత్రి కావాలని స్వరూపానంద చేత రాజసూయ యాగం, రాజశ్యామల యాగం, చండీ యాగం, ఆ యాగం ఈ యాగం అంటూ కోట్లాది రూపాయల ప్రజాధనం తగలేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని ఈ స్వరూపానందకు ఎకరా రూపాయికే ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఆ జీవోను రద్దు పరచి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఇక చినజియ్యరు చేత యాదాద్రి నిర్మించి వేల కోట్ల రూపాయాలను తగలేశారు. యాగఫలాలు ఎమైనాయి? ప్రజాబలం ముందు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలారా ఆలోచించండి. జ్యోతిష్యుల ముసుగులో వున్న ఇలాంటి దొంగల చేత మోసపోకండి. వీళ్లను దగ్గరకు రానివ్వవద్దు. వీళ్ళంతా మోసగాళ్లు. వీరంతా వృత్తులు మార్చుకొని సమాజ ఉత్పత్తిలో భాగమైతే మంచిది.

– నార్నె వెంకట సుబ్బయ్య,ఎ.పి.హేతువాద సంఘం అధ్యక్షుడు.

➡️