Viveka murder case: సునీల్‌ యాదవ్‌, ఉదయ్ కుమార్‌ రెడ్డిలకు బెయిల్‌ నిరాకరణ

May 3,2024 22:01 #judgement, #telangana high court

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉదయ్ కుమార్‌ రెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  మరో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది.
సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జరిగిన విచారణలో పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. వివేకా హత్యకు సునీల్‌ సహకరించినట్లు అన్ని ఆధారాలూన్నాయని నివేదించింది. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంట్లో ఆయన ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా తేలిందని పేర్కొంది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య సంఘటనలో ఆయన పాల్గొన్నాడానికి అదొక్కటే ఆధారం కాదని వివేకా ఇంటి వద్ద వాచ్‌మెన్‌ రంగన్న, అప్రూవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం సునీల్‌ యాదవ్‌ పాత్ర ఉందని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య అనంతరం గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ పారిపోతుండగా గుర్తించినట్లు రంగన్న వాంగ్మూలం ఇచ్చారని వివరించారు. దీనికితోడు సిసి టివి ఫుటేజీ, హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య ఫోన్‌ సంభాషణల కాల్‌ డేటా రికార్డు ఉందని తెలిపారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఇదే కేసులో అరెస్టయి కండీషనల్‌ బెయిల్‌పై ఉన్న భాస్కర్‌రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరుచేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈ కేసులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

➡️