కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఇచ్చే నగదు రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే దీన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో త్వరలో కుల గణన చేపట్టనున్నట్టు తెలిపారు. వీటికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సిఎస్‌ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

➡️