కార్పొరేటర్‌ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

Jan 8,2024 13:17 #Keshineni Shweta, #resigns, #TDP

ప్రజాశక్తి – విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ 11వ డివిజన్‌ టిటిడి కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి ఈ మేరకు లేఖ అందించారు. తన లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత టిడిపికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. తాము ఎప్పుడూ టిడిపిని వీడాలని అనుకోలేదని, ఆ పార్టీయే తమను వద్దనుకున్నప్పుడు కొనసాగడం భావ్యం కాదన్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తారని తెలిపారు. గౌరవం లేని చోట తాము పనిచేయలేమని, కేశినేని నాని, తాను ప్రజల తరుపున పోరాడతామని అన్నారు. ఏడాది కాలంగా టిడిపిలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారని, ఎన్‌టిఆర్‌ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పటి వరకు పార్టీ అధిష్టానానికి తెలియదనే తాము భావిస్తున్నామని చెప్పారు. విఎంసి ఎన్నికల సమయంలో తమను ముగ్గురు నాయకులు ఇబ్బంది పెట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో తాము పార్టీని వీడుతున్నామని, తమతో వచ్చే వారికి కచ్చితంగా అండగా ఉంటామని వివరించారు. తిరువూరులో చంద్రబాబు సభకూ, కేశినేని నానికీ ఏంటి సంబంధమని నారా లోకేష్‌ అడిగారన్నారు. కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పార్లమెంట్‌ నియోజవర్గంలో జరిగే సభకు ఆయనకు కాకుండా ఇంకెవరికి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. మూడోసారి కూడా విజయవాడ పార్లమెంట్‌ నుంచే నాని పోటీ చేస్తారని చెప్పారు. అంతకుముందు కేశినేని శ్వేత టిడిపికి రాజీనామా చేయనున్నట్లు ఎంపి కేశినేని తన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

➡️