పర్యవేక్షణ కొరవడడమే ర్యాగింగ్‌ రుగ్మతకు ప్రధాన కారణం

Apr 10,2024 15:40 #Hostels, #jagityala, #ragging disorder

జగిత్యాల: ర్యాగింగ్‌ అనేది ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగఅహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. 6,7వ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ నేపథ్యంలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెప్పిన పని వినలేదని ఆరవ తరగతి విద్యార్థులను సీనియర్లు చితకబాదారు. ఆరో తరగతికి చెందిన నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మొహంపై గాయాలు, తీవ్ర జ్వరంతో విద్యార్థులు బాధపడుతున్నా అధికారులు తల్లిదండ్రులకు సమాచారమివ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. మంగళవారం సెలవు కావటంతో చూసేందుకు తల్లిదండ్రులు వెళ్లగా.. ముఖంపై గాయాలు కావడంతో ర్యాగింగ్‌ వ్యవహారం బయటపడింది. విద్యార్థుల ముఖంపై గాయాలు చూసిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పేరెంట్స్‌కు ఎందుకు చెప్పలేదని అధికారులపై మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
‘ర్యాగింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం’..అంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ర్యాగింగ్‌ భూతం ఇంకా వీడలేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాలు కఠినంగా ఉండడంతో కొంతవరకూ తగ్గుముఖం పట్టినా.. ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగఅహాల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాటిపై పర్యవేక్షణ కొరవడడమే ర్యాగింగ్‌ రుగ్మత పెరగడానికి కారణమని తేటతెల్లమవుతోంది.

➡️