విశాఖ నార్త్ నుండి లక్ష్మీ నారాయణ పోటీ

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, వి.వి. లక్ష్మీనారాయణ ప్రకటించారు. అంతేకాకుండా తమ పార్టీ కి కేంద్ర ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తు ను కేటాయించిందని తెలిపారు. గురువారం ఉదయం విశాఖపట్నంఎంవిపి కాలనీలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ వి.వి.లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, అందరికి అవినీతి రహిత పాలన అందిస్తామని, రాష్టాన్ని అభివృద్ధి పరుచుకోవాలని, ఏ.పీ. యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని డబ్బులు ఇచ్చి కొనడాన్ని వ్యాపారంగా భావిస్తున్నారు. కాబట్టి, ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకు ఓటును వేయాలని, అవినీతి రహిత ప్రభుత్వం, నిరుద్యోగ రహిత ప్రభుత్వం కావాలంటే ఏ.పీ. యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించవలసిందిగా కోరారు. ఈ 75 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రెండు కులాలను నమ్మి మోసపోయారు కావున ప్రత్యమ్మాయంగా ఒక అవకాశాన్ని ఇచ్చి, నిజమైన ప్రజాపాలన అంటే ఏంటో అర్థం తెలియజేస్తామని తెలియజేసారు. చట్టసభలకు ప్రజా ప్రతినిధులని పంపాలి గాని, రాజకీయ వ్యాపారాలను కాదని చెప్పారు. కచ్చితంగా యునైటెడ్ ఫ్రంట్ రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలో ప్రధాన భూమికను పోషిస్తుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ నాయకులు డా.కె.శివ భాగ్యారావు, ప్రభుధ్ధ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ దాసరి చెన్నకేశవులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ జలీల్, నవతరం పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, తో పాటు పలువురు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

➡️