పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌కు భూమివ్వం

Jan 10,2024 21:36 #power plant

నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌కు రైతుల వినతి

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ :గ్రీన్‌ కో పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌కు తమ భూమి ఇవ్వబోమని బాధిత రైతులు తేల్చి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి, పాతపాడు, పసుపల, పత్తేనగరం, కటికవానికుంట తదితర గ్రామాల రైతులు నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌ టి రాహుల్‌ కుమార్‌ రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ గ్రామాల పరిధిలో దాదాపు 650 ఎకరాల సారవంతమైన భూమి ఉందని, ఏడాదికి రెండు సార్లు పంటలు పండుతాయని, 350 మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. దీనికి తోడు పశుసంపదనూ ఈ పొలాల ఆధారం చేసుకుని పోషిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఈ భూమిని పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ కోసం తమ అనుమతులు లేకుండానే అధికారులు సర్వే చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టుకు భూములిస్తే తమ కుటుంబాలు వీధినపడతాయని, తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని విన్నవించారు. వినతి పత్రం అందజేసినవారిలో ఆయా గ్రామాల రైతులు గడ్డం వెంకట్రామిరెడ్డి, బెడదల నారాయణరెడ్డి, దొర్నిపాటి వెంకటేశ్వర్లు, బెడదల రామేశ్వరరెడ్డి, జక్కల అశోక్‌ చక్రవర్తి, చెంచు విజయకుమార్‌ తదితరులు ఉన్నారు..

➡️