అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి -ముఖ్యమంత్రికి వామపక్ష పార్టీల లేఖ

left parties letter to cm jagan

– దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ప్రస్తావన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీల గ్రాట్యుటీ, వేతన పెంపు అంశాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని వామపక్ష పార్టీలు కోరాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు వై సాంబశివరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు ఎన్‌ మూర్తి, ఎస్‌యుసిఐసి నాయకులు బిఎస్‌ అమర్‌నాథ్‌, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకి రాములు ఉమ్మడిగా బుధవారం లేఖ రాశారు. లక్ష మందికి పైగా అంగన్‌వాడీ ఉద్యోగులు 15 రోజులకు పైగా సమ్మె చేస్తున్నప్పటికీ, ఆ సమ్మెను పరిష్కరించే దిశగా ప్రభుత్వం డిసెంబరు 26 రాత్రి జరిగిన చర్చల్లో ఎటువంటి ప్రయత్నమూ లేదని పేర్కొన్నారు. పైగా ఈ సమస్య ఇంతవరకు తమ దృష్టికి తీసుకురాలేదని మంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, మంత్రి, అధికారులు అంగన్‌వాడీలను బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయని, సమస్యలు పరిష్కరించడానికి బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం విచారకరమని అన్నారు. అంగన్‌వాడీల్లో అత్యధికులు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒంటరి మహిళలేనని తెలిపారు. వీరు అత్యంత దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారన్నారు. అటువంటి మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికైనా తక్షణం జోక్యం చేసుకొని వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఎంను కోరారు. 4, 5 సంవత్సరాలకోసారి వేతన సవరణ కోసం ఏ రంగంలోనైనా కార్మికులు, ఉద్యోగులు పోరాడటం సర్వసాధారణమని అన్నారు. అంగన్‌వాడీలకు ప్రత్యేకించింది కాదని, అంగన్‌వాడీల వేతనాల పెంపుదల, గ్రాట్యుటీ చెల్లింపు కోర్కెలు న్యాయసమ్మతమైనవని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.

(1) గుజరాత్‌ అంగన్‌వాడీల గ్రాట్యుటీ సమస్య సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంగన్‌వాడీలు, వర్కర్లేనని, యాజమాన్యం, కార్మిక సంబంధం ఉందని, ప్రభుత్వమే రిక్రూట్‌మెంట్‌ చేసి రిటైర్మెంట్‌తో సహా కొన్ని నిబంధనల ప్రకారం వారితో పని చేయించుకుంటోందని తెలిపిందని పేర్కొన్నారు. వారికిచ్చేది గౌరవ వేతనం కాదని, వేతనమేనని చెప్పిందని, ఈ రీత్యా చూసినప్పుడు అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

(2) ఎపి కంటే తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉన్నాయని, తెలంగాణ కంటే నెలకు వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వేతనాలు చెల్లిస్తామని ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వాగ్దానం చేశారని, పక్కనున్న తమిళనాడుతో సహా కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరానికి రూ.500 చొప్పున వేతనాలు పెంచుతున్నారని పేర్కొన్నారు.

(3) మినీ అంగన్‌వాడీల్లో పనిచేసేవారు అత్యధిక భారం మోస్తూ తక్కువ వేతనం పొందుతున్నారని, వాటిని పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చి వేతనాలు పెంచాలని కోరారు.

(4) రిటైర్డు అయిన అంగన్‌వాడీలు గ్రాట్యుటీకి అర్హులని గుజరాత్‌ రాష్ట్రానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. ఆ ప్రకారం గుజరాత్‌తో పాటు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం నుండి గ్రాట్యుటీ చెల్లిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకోవాలని మంత్రులు చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు.

(5) అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలకు చెల్లించే వేతనం చాలా అథమ స్థాయిలో ఉందని, 2006లో ప్రైవేట్‌ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కంటే చాలా తక్కువగా ఉందని తెలిపారు.

(6) దేశంలో అనేక రాష్ట్రాల్లో పెన్షన్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

(7) గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం లేకుండా మరింత కాలం ఉంచడం భావ్యం కాదని, ఎప్పడి నుండో అంగన్‌వాడీలు ప్రభుత్వానికి మహజర్లు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లారని, దానికి అంగన్‌వాడీలను నిందించలేరని, పిల్లలను అంగన్‌వాడీ స్కూల్‌కు తీసుకురావడం, వారికి సేవలు చేయడం, ఇంటికి దింపి రావడం అంగన్‌వాడీలు చేస్తున్నారని, లబ్ధిదారులు కూడా అనేకచోట్ల సమ్మెకు మద్దతుగా నిలబడుతున్నారని పేర్కొన్నారు.

(8) జనవరి 1 నుండి సెంటర్లు తెరవడానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రివర్గం హెచ్చరించడం సమంజసం కాదని, ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

(9) రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో 5,606 మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్‌లుగా మారుస్తూ వెంటనే జిఓ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పరిస్థితిని పరిశీలించి వ్యక్తిగతంగా చొరవ తీసుకొని వేతనాలు, గ్రాట్యుటీ సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఎంను వామపక్షాలు కోరాయి.

➡️