స్టీల్‌ప్లాంట్‌ను ప్ర్రయివేటుపరం కానివ్వం

  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు
  • 1200 రోజులకు చేరిన దీక్షలు

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం కానిచ్చేది లేదని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1200వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు), విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. పోరాటాలతో ఉక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజల భూముల త్యాగం, 64 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేల రాజీనామాలతో నాడు ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు – ఆంద్రుల హక్కు నినాదంతో రాష్ట్రం మార్మోగిందన్నారు. అంతటి చరిత్ర ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుపరం కానిచ్చేది లేదన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరు శాతం వ్యూహాత్మక అమ్మకం చేస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచీ చేపట్టిన ఆందోళనలు, దీక్షలకు 1200 రోజులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వాల ప్రయివేటీకరణ కుట్రలను ఉద్యమం ద్వారా తిప్పికొట్టామన్నారు. ఉక్కు పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నర్సింగరావు అభినందనలు తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామన్న నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, ఎం రాజశేఖర్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు స్థానిక యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. స్టీల్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను కాగ్‌ నివేదికలు తప్పు పట్టినా.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఒప్పందాలను తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. దీక్షల్లో స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, నాయకులు శ్రీనివాస్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎన్‌.రామారావు, కెఎస్‌ఎన్‌.రావు, నీరుకొండ రామచంద్రరావు, యు.రామస్వామి, వైటి.దాస్‌, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌, బొడ్డు పైడిరాజు, శ్రీనివాసులు నాయుడు, నమ్మి సింహాద్రి, గుమ్మడి నరేంద్ర, శ్రీనివాస్‌, పుల్లారావు పాల్గొన్నారు.

➡️