గ్లాసు, కమలం ప్రభావమెంత?

May 3,2024 02:30 #BJP, #JanaSena

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గత ఎన్నికల్లో కనీస ఉనికిని కూడా కోల్పోయిన భారతీయ జనతా పార్టీ, ఒకే ఒక్క సీటుతో చతికిలపడ్డ జనసేన ఈసారి ఎన్నికల్లో కొంతైనా ప్రభావాన్ని చూపించుకునేరదుకు బరిలోకి దిగుతున్నాయి. ఈ రెరడు పార్టీలు ఈసారి టిడిపితో పొత్తుతో ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో కొన్ని సీట్లయినా దక్కుతాయన్న ఆశతో ఉండడం గమనార్హం. అలాగే వామపక్ష పార్టీలతో కలిసి వెళ్తున్న కాంగ్రెస్‌ ఈసారి తమ ఓటు బ్యాంకును పెరచుకోవాలని యోచిస్తోంది.

2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటులో విజయం సాధించగా, పార్టీ అధినేత పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయాన్ని చవిచూశారు. ఈ ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి 5.53 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 3,14,09,811 ఓట్లు పోలుకాగా, అందులో జనసేనకు 17 లక్షల వరకు మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 173 స్థానాల్లో పోటీచేసిన బిజెపికి కేవలం 0.84 శాతం ఓట్లు రావడం, అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఆ పార్టీ అభ్యర్థులకు మొత్తం 2.63 లక్షల ఓట్లు మాత్రమే పడ్డాయి.

పొత్తుపైనే ఆశలన్నీ..
టిడిపితో కలిసి వెళ్లడంతో ఈ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు పెరుగుతుందన్న ఆశాభావాన్ని బిజెపి, జనసేన వ్యక్తం చేస్తున్నాయి. టిడిపి పోటీ చేయకుండా జనసేన, బిజెపి అభ్యర్థులు బరిలో ఉండే స్థానాల్లో టిడిపి కేడర్‌ నుంచి ఎంతవరకు సహకారం ఉంటురదన్నదానిపైనే ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు పెరుగుదల ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్‌..
గత ఎన్నికల్లో 174 స్థానాల్లో పోటీ చేసి.. ఎక్కడా డిపాజిట్‌ కూడా దక్కని కాంగ్రెస్‌ పార్టీ ఈసారి శక్తిమంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. గత ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లతో 3.68 లక్షల ఓట్లను మాత్రమే సాధించిన ఈ పార్టీ కొత్త కేడర్‌, కొత్త నాయకత్వంతో ఈసారి బరిలోకి దిగుతుండటం విశేషం. అనేక ప్రారతాల్లో మంచి పట్టున్న వామపక్షాలతో కలిపి ఈసారి ఎన్నికలకు దిగుతున్న ఈ ‘ఇండియా ఫోరం’ ఈసారి ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని, వీలైనన్ని ఎక్కువ సీట్లతో ఆంధ్రాలో మరోసారి పాగా వేయాలని భావిస్తోంది. మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల నేతృత్వంలో, వామపక్షాల మిత్రత్వంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే అనేక ప్రారతాల్లో సీనియర్‌ నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్‌లోకి తరలి వస్తుండడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. అందుకే సీట్లు, ఓట్లు కూడా పెరుగుతాయని ఫోరం అంచనా వేస్తోంది.

➡️