ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలపై అప్పులు

 మాజీమంత్రి కెఎస్‌ జవహర్‌

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :   ఇళ్ల నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదలపై భారం మోపారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కెఎస్‌ జవహర్‌ విమర్శించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన స్థలాలు చివరకు నివాసానికి పనికిరాని సెంటు పట్టాలు ఇచ్చారని తెలిపారు. అందులో ఇల్లు కట్టుకోకుంటే వెనక్కు తీసుకుంటామని పేదల్ని బెదిరించారని, చేసేది లేక అప్పులు చేసీ మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.1.80లక్షలు తప్ప జగన్‌ ప్రభుత్వం పేదలకు ఒక్కరూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి కుటుంబంపై రూ.5లక్షల అప్పుల భారం పడిందన్నారు.

జెపి వెంచర్స్‌కు రూ.1240కోట్లు ధారాదత్తం: కొమ్మారెడ్డి

ఇసుక తవ్వకాల టెండర్ల ముసుగులో జగన్‌ ప్రభుత్వం జయప్రకాష్‌ వెంచర్స్‌(జెపి) సంస్థకు రూ.1250కోట్లు ధారాదత్తం చేసిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 మే వరకు ఎపి మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూ.2610కోట్ల ఇసుక అమ్మకాలు జరిపిందని జిఎస్టి ఇంటిలిజెన్స్‌కు గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి లేఖ రాశారని తెలిపారు. 2021లోనే రెండేళ్ల ఇసుక తవ్వకాల టెండర్‌ను రూ.2,764కోట్లు నిర్ణయించాల్సి ఉండగా కేవలం రూ.1528కోట్లకే జెపికి కట్టబెట్టారని ఆరోపించారు. జెపి సంస్థ ఇంకా ప్రభుత్వానికి రూ.500కోట్లు బాకీ పెట్టిందని, దీనిని ఎవరు చెల్లిస్తారని నిలదీశారు.

‘జెండా’ విజయవంతంతో వైసిపిలో వణుకు

తాడేపల్లి గూడెంలో టిడిపి-జనసేన నిర్వహించిన ఉమ్మడి భారీ బహిరంగ సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి వైసిపి నాయకులు వణుకుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, పిల్లి మాణిక్యారావు, కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టిడిపి కార్యాలయంలో గురువారం వేరువేరుగా వారు విలేకరులతో మాట్లాడారు. దెబ్బతిన్న రైతుల కోసం, యువత ఉద్యోగాల కోసం, చిధ్రమవుతున్న పేదవారిని కాపాడేందుకు టిడిపి-జనసేన కదం తొక్కాయని అన్నారు. తమ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

➡️