మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యం : డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి

May 26,2024 20:23 #Kadapa, #Literature, #Rayalaseema River

ప్రజాశక్తి – కడప అర్బన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : నది పరివాహక ప్రాంతాల భౌగోళిక, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థికాంశాలతో కూడుకున్న మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యమని సిపి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సిపి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 132వ సదస్సు నిర్వహించారు. ‘రాయలసీమ నదీ సాహిత్యం’ (మొదటి ప్రసంగం) అనే అంశంపై శివారెడ్డి మాట్లాడుతూ విద్వాన్‌ విశ్వం ‘పెన్నేటి పాట’, పి రామకృష్ణారెడ్డి ‘పెన్నేటి కతలు’ అనే రచనల్లోని నదీ సాహిత్యాన్ని విశ్లేషించారు. పెన్నేటి పాట చిన్న కావ్యమైనప్పటికీ ప్రాంతీయ అస్తిత్వం దిశగా తెలుగు సాహిత్యంలో చైతన్యం నింపిందన్నారు. రాయలసీమ రైతు కన్నీటిగాధను కరుణ రసాత్మకంగా విశ్వం చిత్రించారని వివరించారు. పెన్నా నది ప్రవహించినప్పుడు ఆనందాన్ని, ఎండినప్పుడు దు:ఖాన్ని మిగిల్చిన జ్ఞాపకాలకు అక్షరరూపాన్ని ఇస్తూ ప్రాంతీయ భాషకు పట్టం గట్టారన్నారు. పెన్నేటి కతలు వెలువరించిన రామకృష్ణారెడ్డి పోట్లదుర్తి దగ్గర పెన్నా నది ఒడ్డున ఉన్న హనుమనగుత్తి గ్రామానికి చెందినవారని, ఆ ఊరి పరిసర ప్రాంత జనజీవనానికి అద్దం పట్టేలా కథలను రాయలసీమ మాండలికంలో రాశారని వివరించారు. వ్యవసాయం తీరు తెన్నులు, రైతులు కూలీలుగా మారి వలస పోవడం, అనావృష్టితో ఒకసారి, అతివృష్టితో మరోసారి పంట నష్టపోవడం, పశువులకు, రైతులకు మధ్య ఆత్మీయ అనుబంధాన్ని ఆయన తన కథల్లో చిత్రించారన్నారు. వీరి రచనలతోపాటు పాలగిరి విశ్వప్రసాద రెడ్డి ‘చుక్క పొడిచింది’, శాంతి నారాయణ ‘పెన్నేటి మలుపులు’, డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌ ‘పాపాగ్ని కథలు’, బత్తుల ప్రసాద్‌ ‘సగిలేటి కథలు’ లాంటి మరికొన్ని రచనలను పెన్నా నదీ సాహిత్యంలో అంతర్భాగంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, గానుగపెంట హనుమంతరావు, పుత్తా పుల్లారెడ్డి, కొత్తపల్లి రామాంజనేయులు, రాజారెడ్డి, రమణారెడ్డి, డాక్టర్‌ సాయిప్రసాద్‌, చంద్రశేఖర రెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, నారాయణ రెడ్డి, బాలరాజేశ్వర రెడ్డి, బాలయల్లారెడ్డి, స్వరూపరాణి, రామమోహన్‌ రెడ్డి, రెడ్డయ్య, గంగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

➡️