కార్యకర్తలను అవమానిస్తే తీవ్ర పరిణామాలు- మంత్రి అచ్చెన్నాయుడు

Jun 18,2024 22:40 #Minister Achennaidu, #press meet

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి :గత ప్రభుత్వంలో అధికారులు తమపై కనీస గౌరవ, మర్యాదలు లేకుండా ప్రవర్తించారని, ఇప్పుడు అటువంటి వాటికి స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో కలిసి అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కార్యాలయాలకు వచ్చే ప్రజాప్రతినిధులను ముఖ్యంగా తమ కార్యకర్తలను కలెక్టర్‌ నుంచి అటెండర్‌ వరకు గౌరవించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో గ్రీవెన్స్‌ నిర్వహించాలని, సమావేశాల పేరుతో తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. గతంలో ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లను, వైర్లను దొంగిలించుకుపోయారని, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. టెక్కలిలోని పాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని ఒక ప్రయివేట్‌ వ్యక్తికి ఇచ్చేశారని, ఇందులో కలెక్టర్‌, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారి, తహశీల్దార్‌ పాత్రపై నివేదిక ఇవ్వాలని, కలెక్టర్‌ ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవన్నారు. తమ సొంత గ్రామం నిమ్మాడలో పిహెచ్‌సి ఏర్పాటు చేసినా తనకు గానీ, ఎంపికి గాని తెలియజేయకుండా కొండపై భవనం నిర్మించారని, దీనికి కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారా? ఇతర అధికారులెవరైనా ఇచ్చారా? రాష్ట్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపయోగంగా మారిన భవన నిర్మాణ ఖర్చులను సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేస్తామన్నారు. విచారణ చేపట్టి ఒకరిద్దరు అధికారులను జైల్లో పెట్టకపోతే మిగిలినవారు కంట్రోల్‌లో ఉండరని అన్నారు.

➡️