ప్రజా ధనం దుర్వినియోగం : టిడిపి ఎంపి కనకమేడల

Dec 26,2023 08:48 #Tdp mp kanakamedala

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ పథకాల పేరుతో కుంభకోణాలకు పాల్పడుతూ ఒకలా, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ మరోలా దుర్వినియోగం చేస్తోందని టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. పరిశ్రమలను వెళ్లగొట్టడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. సుమారు రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులను రాష్ట్రానికి రాకుండా భయపెట్టి పారిపోయేలా చేశారని ఆరోపించారు. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ చదివిన వారిలో నిరుద్యోగ రేటు 24 శాతంగా ఉందన్నారు. గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు లేకపోవడంతో నాలుగేళ్లలో 1,340 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. పోలీసులను ప్రైవేట్‌ ఆర్మీగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

➡️