రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిని వ్యతిరేకించండి: ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు

Apr 30,2024 01:48 #MLC KS Lakshmana Rao

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ : రాజ్యాంగ మౌలిక స్వరూపాలైన ఫెడరలిజం, సెక్యులరిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థలపై దాడి జరుగుతుందని, ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని శాసనమండలి సభ్యులు కెఎస్‌.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిలా తణుకులోని మెడికల్‌ హాలులో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం, తణుకు స్టడీ సర్కిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ-కర్తవ్యాలు’ అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ 2029 నాటికి డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పించాలని, సంక్షేమ రాజ్యస్థాపన జరగాలని, భారతదేశ భిన్నత్వమూ, సమగ్రతా కాపాడబడాలని రాజ్యాంగం నిర్ధేశించిందన్నారు. కాని ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలపైనే దాడి జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక న్యాయానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేటి కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారన్నారు. మైనారిటీ, దళితులపై దాడులు గత పదేళ్ల కాలంలో పెగిరిపోయాయన్నారు. మణిపూర్‌లో రిజర్వేషన్ల పేరుతో కుకీలు-మెయితీల మధ్య చిచ్చు రాజేయడమే దీనికి ఉదాహరణ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో మతపరమైన విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెగబడుతూ సెక్యులర్‌ స్వభావానికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం లౌకికతత్వాన్ని ప్రభోదించిందని, కాని ఏక పౌరస్మృతి సిఎఎ, ఎన్‌ఆర్‌సిల అమలుకు పూనుకుంటుందని విమర్శించారు. సెక్యులర్‌ అన్న పదాన్నే సహించలేకపోతున్నారని, అందుకే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నాలను మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలు, ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఛైర్మన్‌ పి.దక్షిణామూర్తి, ప్రముఖ సామాజికవేత్త, తణుకు స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ డివివిఎస్‌.వర్మ, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఉభయగోదావరి జిల్లాల కార్యదర్శి కామన మునిస్వామి, ఎండి అబ్ధుల్‌ రహమాన్‌, పేరూరి మురళీకుమార్‌, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️